అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్ని పేదలకు సెంటు స్థలాల కోసం పంచుతానని బయలుదేరింది ప్రభుత్వం. అందు కోసం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి చట్టాలను మార్చింది. జీవోలు ఇచ్చింది. ఇప్పుడు పంచేందుకు సిద్ధమయింది. వీరంతా బయట పేదలపై ఇలాంటి ప్రేమ చూపించడం లేదని ఎవరికైనా తెలుస్తుంది. పేదల పేరుతో రాజకయం చేసి అమరావతి పీక నొక్కడానికి .. భవిష్యత్లో భయంకరమైన అలజడి రేపడానికి చేసిన కుట్ర ఇది. వ్యవస్థల్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్న ఈ ప్రయత్నం చివరికి పాలకుల్నే బలి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయం కోసం పేదల్ని పావులుగా వాడుకుంటారా ?
పేదల్ని రాజకీయ కుట్రలకు బలిచేసే వ్యూహం అమరావతిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి రైతులు ఇచ్చిన భూముల్లో ఇవ్వడం అదీ కూడా రాజధాని మాస్టర్ ప్లాన్ను మార్పు చేసి ఇవ్వడమే కాదు.. రైతుల హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో ఇవ్వడం అలజడి రేపే ప్రయత్నమే. రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు కాబట్టి.. వారి మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి..దాంతో చలి మంటలు వేసుకుని రాజకీయ లబ్ది పొందాలన్న దారుణమైన కుట్రలను ప్రభుత్వం చేస్తోంది.
రైతులకు హామీ ఇచ్చిన ప్లాట్లను ఎందుకివ్వలేదు?
రాజధాని భూములను అభివృద్ధి చేసి.. సీఆర్డీఏ చట్టం ప్రకారం వారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. వారి భూముల్ని ఇతరులకు సెంట్ చొప్పున పంచుతామంటే ఎలా అన్నది ఎవరికైనా వచ్చే సందేహం. అది అన్యాయం అని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. కానీ రాష్ట్రంలో చాలా మంది పెద్దలు అమరావతి రైతుల్ని దోచుకోవడం కరెక్టేనన్నట్లుగా మాట్లాడుతున్నారు. చట్టం, న్యాయాల గురంచీ చెప్పలేకపోతున్నారు. ముందుగా ఒప్పందం ప్రకారం రైతులకు ఇవ్వాల్సినవి ఇచ్చి ఆ తర్వాత ఏమైనా చేయవచ్చు కదా అంటే సౌండ్ ఉండదు. అమరావతిలో అభివృద్ధి కోసం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు…కానీ సెంట్ స్థలాలను మార్కింగ్ చేయడానికి యూభై కోట్లు విడుదల చేశారు.
రాజధానిలో పేదలండకూడదనే ప్రచారం కుట్ర కాదా ?
రాజధానిలో పేదల ఉండకూడదని ఎవరన్నారు ? రైతుల భూముల్నే ఇవ్వొద్దంటున్నారు. ప్రభుత్వం నవులూరు.. ఇతర చోట్ల పెద్ద ఎత్తునభూముల్ని ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. వాటిని సెంట్ స్థలాలుగా ఎందుకు ఇవ్వలేదు. వాటిని తీసుకోవడానికి పేదలు అర్హులు కారా? కేవలం రేతులు ఇచ్చినవి మాత్రమే సెంట్ స్థలాలుగా చేసి. ఓ రణక్షేత్రాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడినవారికి ఎలాంటి శిక్షలు పడ్డాయో చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. అలాంటి శిక్షల కోసం ఎదురు చూడాల్సిందే.