అసెండాస్ సింగ్‌బ్రిడ్జికి అమరావతి నిర్మాణం అప్పగింతపై ఏ దశలోనూ ఎలాటి అనుమానాలు లేవు. క్యాబినెట్లోనూ ఆమోదం తీసుకున్నారు. అప్పగింతలే తరువాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మేరకు ఎన్నడో నిర్ణయానికి వచ్చారు గనక మరో విధంగా జరిగే అవకాశమే వుండదు. దానికోసం ఆయన అనేక పర్యటనలూ మంతనాలు జరపడం అందరికీ తెలిసిన సత్యం.అయితే ఈ సంస్థ లేదా కన్సార్టియం సింగపూర్ ప్రభుత్వ సంస్థగా చెప్పడం పాక్షికసత్యం. తమ దేశ వాణిజ్యాభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెటిసి ఆధ్వర్యంలోని సంస్థ మాత్రమే. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం వుండదు. పైగా ఈ సంస్థలో దాదాపు సగం ప్రైవేటు భాగస్వామికి చెందుతుంది గనక వారిదే కీలక నిర్ణయాధికారమవుతుంది. ఇది ఎమ్మార్ ఎంజిఎప్ వంటి ప్రయోగమే మరింత పెద్ద స్థాయిలో జరుగుతున్నది.
ఈ కన్సార్టియంతో కలసి అమరావతి డెవలప్మెంట్ కంపెనీ నిర్మాణం చేపట్టిన తర్వాత భూమి మనదైనప్పటికీ పెట్టుబడి వారు తీసుకొస్తారనే పేరిట 58:42 శాతం వాటాలు వుంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కంటే అసెండాస్‌కు నాలుగు శాతం ఎక్కువ వాటా వుంటుంది.
మరో విషయమేమంటే అసెండాస్ ఇప్పటి వరకూ హైదరాబాదుతో సహా చాఆచోట్ల చాలా దేశాల్లో ఐటిపార్కులు, వాణిజ్య సముదాయాలే కట్టినట్టు వారి అధికారిక బ్రోచర్ చెబుతున్నది. రాజకీయాధికార కేంద్రాలు ప్రజావాసాలకు సంబంధించిన ఉదాహరణ కూడా అందులో అసలు లేదు. అమరావతి ప్రజా జీవనం తొణకిసలాడేలా వుండాలి తప్ప కేవలం పాలనా కేంద్రంగా వుండరాదని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు.కాని అసెండాస్ పూర్వాపరాలు అందుకు ఏ మాత్రం అనుగుణంగా లేవు. అసెండాస్ గతాన్ని బట్టి చూసినప్పుడు అచ్చమైన వాణిజ్య తరహా నిర్మాణాలు చేసి లాభం గడించడం తప్ప సామాజిక కోణం ్ట కనిపించదు.
వీటన్నిటికన్నా అభ్యంతరకరమైంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య. నిజానికి బాధాకరమైంది కూడా. నాలుగు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడిన తర్వాత అసెండాస్సింగ్బ్రిడ్జి సెంబ్‌కార్ప్ సముదాయం ఆసియాలో పెద్దదిగా ఆవిర్భవించిన మాట నిజమే. అంతమాత్రాన ముఖ్యమంత్రి మన దేశీయ సంస్థలను తీసిపారేయడం మనం కట్టినవి మురికివాడల్లా వుంటాయని చెప్పడం బాగాలేదు. హిందూ దీనికి ఒక ఉపశీర్షిక ఇచ్చి మరీ రాసింది. చిన్న చిన్నవి మనవాళ్లకు ఇద్దాంలే అన్నట్టు ఆయన మాట్లాడారు. ఎల్‌అండ్‌టి పల్లోంజి పేర్లు కూడా ప్రస్తావించారు. అమరావతి నగర అపురూపశిల్పాలు అని అలనాడే కట్టుకున్న వాళ్లం ఆధునిక కాలంలో అంత వెనకబడిపోయామా?