జనసేన అధినేత పవన్ కల్యాణ్… హఠాత్తుగా ప్లాన్ మార్చారు. తాను రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు స్పష్టమైన సమాచారం పంపారు. షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారు. బీజేపీతో కలిసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలనుకున్న పవన్ కల్యాణ్‌కు.. బీజేపీ వైపు నుంచి.. కుంటి సాకులు ఎదురొచ్చాయి. పార్లమెంట్ సమావేశాలని… అగ్రనేతలు అందుబాటులో ఉండరని… కేంద్రమంత్రులు రారని.. ఇలాంటి సాకులతో.. రెండో తేదీన నిర్వహించాలనుకున్న కవాతును వాయిదా వేశారు. ఆ తర్వాత అయినా… బీజేపీ నుంచి .. అమరావతి ఉమ్మడి కార్యాచరణ విషయంలో సానుకూలత వస్తుందన్న నమ్మకం పవన్ కల్యాణ్‌కు లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో.. బీజేపీని నమ్ముకుని తాను సైలెంట్ గా ఉంటే.. తన క్రెడిబులిటి కూడా దెబ్బ తింటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన బీజేపీతో కాకపోయినా.. తాను ఒంటరిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పొత్తు ఒప్పందాల ప్రకారం… రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేసుకోవాలి. సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి ఉమ్మడిగా ముందుకెళ్లాలి. పవన్ పోరాట ఉత్సాహంలో ఉన్నారు కానీ… బీజేపీ మాత్రం మాటల్లోనే ఆ ఉత్సాహం చూపిస్తోంది. పొత్తు పెట్టుకున్న తర్వాత.. పవన్ ను సైతం .. స్లో చేసే ప్రయత్నాలు బీజేపీ వైపు నుంచి జరిగాయి. ఆయన కార్యాచరణకు తమ అనుమతి కావాలన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు.
పవన్ ఆలోచనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు . ఢిల్లీ ఆమోదం కావాలని … సంకేతాలు ఇస్తూండటంతో… ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయన్న ఆందోళన పవన్ లో పెరిగిందంటున్నారు. రాజధాని రైతులకు సంఘిభావం తెలియచేయాలని ఆయన కొద్ది రోజులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు.. ఆ పని చేయాలనుకుంటున్నారు. బీజేపీ నేతలు వచ్చినా రాకపోయినా… తాను మాత్రం… రాజధాని గ్రామాలకు త్వరలో వెళ్లనున్నారు. అంటే.. బీజేపీ ట్రాప్‌ను… పవన్ దాదాపుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయం… జనసేన వర్గాల్లో ప్రారంభమయింది.