వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. సీఎం జగన్… కృష్ణా, గుంటూరు జిల్లాలకు తేరుకోలేని షాక్ ఇచ్చారు. రాజధానిని అమాంతం ఎత్తేసి.. భీమిలిలో పెట్టాలని డిసైడయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ అయిన మేటర్ రాజధాని. జగన్ వస్తే రాజధాని మార్చేస్తారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు చేశారు. కానీ.. వైసీపీ నేతలు.. ఈ ప్రచారాన్ని ఖండించడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా.. రాజధానిని జగన్ మార్చనే మార్చబోరని సవాళ్లు చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లాంటి వారయితే.. ఒకడుగు ముందుకేసి.. రాజధాని మారిస్తే.. రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశారు. ఇప్పుడు.. ఈ వైసీపీ ఎమ్మెల్యేలంతా.. ఎక్కడికిపోయారో ఎవరికీ అర్థం కావడం లేదు.
నోరు మెదపని గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు..!
గుంటూరు జిల్లాలో పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కృష్ణాజిల్లాలోనూ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరూ.. ఇంత వరకూ స్పందించలేదు. వీరే కాదు.. నెల్లూరు నుంచి … కోస్తా ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలందరికీ.. అమరావతి తరలింపు ఇష్టం లేదు. తీసుకెళ్లి.. ఎక్కడో భీమిలిలో పెట్టడం అంటే.. తమ ప్రజలకు సర్దిచెప్పుకోలేని పరిస్థితి. మిగతా జిల్లాల పరిస్థితేమో కానీ.. కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం.. సమర్థించుకోలేని దుస్థితి. ఓ వైపు ప్రాంతాలను కించ పరుస్తూ మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలపై కులముద్ర వేసి.. చేయాల్సినంత రచ్చ చేస్తున్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యే అంటే.. ఒక్క ఎమ్మెల్యే కూడా నోరు మెదపడం లేదు.
రగిలిపోతున్నా.. కనీసం స్పందించరా…?
చాలా మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేలు ఎక్కడున్నారా.. అని రైతులు వెదుకుతున్నారు. ఇప్పుడు రాజధాని గ్రామాల్లో .. వైసీపీ లేదు.. టీడీపీ లేదు. ముందు తాము మునిగిపోకుండా… చూసుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఎన్నికల ప్రచార సమయంలో.. రాజధాని మారనే మారదని ప్రకటించి ఓట్లేయించుకున్న వైసీపీ అభ్యర్థుల కోసం.. రైతులు.. రాజధాని గ్రామాల వాసులు వెదుకుతున్నారు. కానీ ఒక్కరంటే… ఒక్కరూ ప్రజల్లోకి రావడం లేదు.
ఏం చేసినా సరే.. కులం, మతం చూసి ఓట్లేస్తారని చులకనా..?
వైసీపీ ఎమ్మెల్యేలు.. తమకు ప్రజల ఆదరణ అవసరం లేదని.. భావిస్తున్నారు. జగన్ చల్లని చూపు ఉంటే చాలనుకుంటున్నారు. ప్రజలకు ఏమీ చేయకపోయినా.. కులం పేరుతో.. మతం పేరుతో.. రాజకీయం చేస్తే ఓట్లేస్తారన్న అంచనాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే.. జగన్కు కోపం వస్తుందన్న కారణంగానే.. రాజధానికి అనుకూలంగా.. ఒక్కటంటే.. ఒక్క ప్రకటన చేయడం లేదు. భూములిచ్చిన రైతుల ఆక్రందనలు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్లే మర్చిపోతారని.. ఏవో రెండు స్కీములు ప్రవేశపెడితే.. ఓట్లేస్తారని వాళ్లకి గట్టి నమ్మకం. అందుకే.. తమ జిల్లాల నుంచి రాజధాని తరలిపోయినా పర్వాలేదు.. జగన్ చల్లని చూపు ఉంటే చాలనుకుంటున్నట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.