ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అరాచకాలు చేస్తే.. ఉరిశిక్షేనని ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడు గుడ్లురిమారు. కానీ ఏపీలో పోలీసులు అలాంటి దారుణకృత్యాలకు పాల్పడుతున్నారు. అమరావతిలోని ఓ లాడ్జిలో ఉన్న జంటను బెదిరించి .. డబ్బులో పాటు లైంగిక దోపిడీకి పాల్పడబోయిన ఎస్ఐ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కానీ..ఇంత ఘోరానికి పాల్పడిన ఎస్ఐని కనీసం అదుపులోకి తీసుకోలేదు. పరారీలో ఉన్నట్లుగా చెప్పి.. సరిపెట్టేశారు.
గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న ఓ లాడ్జికి ఓ జంట వచ్చింది. అదే లాడ్జిలో ఎక్కువ సమయం గడిపే రామాంజనేయులు అనే ఎస్ఐ దృష్టిలో ఆ జంట పడింది. అప్పటికే కీచక ఎస్ఐగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఆ జంట లాడ్జిలో కనిపించగానే తోడేలుగా మారిపోయారు. డ్యూటీలో ఉన్నారో లేదో తెలియదు కానీ.. అరెస్టు చేస్తానని.. జైల్లో పెడతానని వారిని బెదిరించారు. డబ్బులివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద డబ్బుల్లేవంటే ఏటీఎంకు వెళ్లమని పంపించాడు. ఏటీఎం నుంచి డబ్బులు తెచ్చే లోపే.. ఆ యువతిపై గదిలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఎస్ఐ రామాంజనేయులు వేధింపులపై యువ జంట అమరావతి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లాడ్జి సీసీ కెమెరాను పరిశీలించగా, బాధితుల ఫిర్యాదును బలపరిచే దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. ఈ వ్యవహారం కలకలం రేపడంతో.. ఎస్పీ వచ్చి లాడ్జిని పరిశీలించారు. ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ పోలీసులకు లేఖ రాసింది. పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. ఆ ఎస్ఐ .. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ప్రైవేటు డ్రైవర్గా పెట్టుకుని చాలా కాలంగా ఇలా.. దోపిడీలకు.. లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ బాధితులు ఎవరో ఒకరు బయటపడే వరకూ.. వారి తోడేలు చర్యలకు బాధితులు బలవుతూనే ఉంటారు.