అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై ఏపీ ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో.. సింగపూర్ కంపెనీలు పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయాయి. అలా వెళ్లి.. నేరుగా హైదరాబాద్‌లో దిగాయి. మంత్రి కేటీఆర్‌తో.. సింగపూర్ ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. పెట్టుబడులతో ముందుకు వచ్చిన కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఐటీ, ఫార్మా, టూరిజం వంటి రంగాల్లో పలు పెట్టుబడుల ప్రతిపాదనలను… కేటీఆర్‌కు.. సింగపూర్ ప్రతినిధులు వివరించారు. త్వరలో పూర్తి స్తాయి ప్రణాళికలను ప్రభుత్వానికి సింగపూర్ ప్రతినిధులు సమర్పించే అవకాశం ఉంది.
భారత్‌లో పెట్టుబడుల కోసం.., సింగపూర్ ప్రభుత్వం, వ్యాపార సంస్థలు.. భారీ ప్రణాళికలే వేసుకున్నాయి. వారి పెట్టుబడులను ఆకర్షించడంలో.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారు. అమరావతి విషయంలో చంద్రబాబు విజన్ నచ్చడంతో అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఉచితంగా ఇచ్చింది. ఇక స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట కోసం రంగంలోకి దిగే సమయంలో… ప్రభుత్వం మారిపోయింది. అప్పటికీ సింగపూర్ ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం… అమరావతి ఓ సామాజికవర్గం వారిదేనని.. ఆ సామాజికవర్గాన్ని బలపర్చాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో.. సింగపూర్ సంస్థతో ఒప్పందాలు కట్ చేసుకుంది.
ఇప్పుడు.. వారు అమరావతిలో పెట్టుబడుల కోసం సిద్ధం చేసుకున్న సొమ్మును.. తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టబోతున్నారు. ఈ అంశంపై.. కార్యాచరణ ప్రారంభించారు. కేటీఆర్ ఇలాంటి అవకాశాలను అసలు వదిలి పెట్టరు. విదేశీ పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి సహకారం అందించి.. హైదరాబాద్‌కు మరింత విస్తృతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే.. ఏపీ ప్రభుత్వం.. వద్దనుకున్న సింగపూర్ పెట్టుబడులను.. తెలంగాణ మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది.