ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళయిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇంకా ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలకి నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం, సింగపూర్, జపాన్ సంస్థల భాగస్వామ్యం గురించి వివరించారు. రాజధాని నిర్మాణం కోసం చైనా, జపాన్ సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ స్థాయిలో రాజధాని నిర్మించాలంటే 5 లక్షల కోట్లు కావాలని ముందే చెప్పానని, దానికి కనీసం 20 ఏళ్ళు పడుతుందని చెప్పారు. యధాప్రకారం కేంద్రం తగినన్ని నిధులు అందించడం లేదని ఆరోపించారు. మిగిలిన మూడేళ్ళలో రాజధాని మొదటి దశ నిర్మాణమైనా పూర్తవుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
రాజధాని నిర్మాణానికి సుమారు 5 లక్షల కోట్లు అవసమని చంద్రబాబు నాయుడు చెపుతుంటే, కేవలం 25,000 కోట్లు సరిపోతుందని కేంద్రం లెక్క కట్టి అంతే ఇవ్వడానికి సిద్దపడింది. చంద్రబాబు కోరుతున్నమొత్తానికి, కేంద్రం ఇస్తానని చెపుతున్న దానికీ చాలా భారీ వ్యత్యాసం ఉంది కనుకనే రాజధానిని స్విస్ చాలెంజ్ పద్దతిలో నిర్మించాలని నిర్ణయించుకొని, విదేశీ సంస్థలను సంప్రదించారు. సింగపూర్ సంస్థ తన మంచితనాన్ని చూసే మాష్టర్ ప్లాన్ ఉచితంగా గీసి ఇచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకొన్నారు. కానీ ఆ మాటలు నమ్మశక్యంగా లేవు.
రాజధాని నిర్మాణానికి పోటీపడిన విదేశీ సంస్థలు గొంతెమ్మ కోరికలు కోరుతుండటంతో ఇంత వరకు నిర్మాణపనులు మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతాయో కూడా ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షలు వ్యయం అవుతుందని చెప్పడం చూస్తే, స్విస్ చాలెంజ్ ఆలోచన విఫలం అయిందేమోనని అనుమానించవలసి వస్తోంది. అంటే ఆ పద్దతిలో నిర్మాణం జరిగే అవకాశం లేదని ఆయన సూచిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి రాజధాని మొదటి దశ పనులు పూర్తవడం గురించి ఆయన గట్టిగా చెప్పలేకపోతున్నారనుకోవలసి ఉంటుంది.
అటువంటప్పుడు, కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం మరికొంత కలిపి రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టి ఉండి ఉంటే ఈపాటికే దానికి కొంత రూపురేఖలు వచ్చి ఉండేవి కదా? చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒకేసారి సింగపూర్, లండన్ స్థాయిలో రాజధానిని నిర్మించాలనుకోవడమే పొరపాటు. కేంద్రం కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర భాజపా నేతలు పదేపదే చెపుతున్నారు కనుక చేతిలో ఉన్న డబ్బుతో ఇప్పటికైనా రాజధాని నిర్మాణ నిర్మాణ పనులు మొదలుపెడితే మంచిది. రాజధానికి రూపురేఖలు వస్తున్న కొద్దీ సహకరించేందుకు, దానిలో పాలుపంచుకొనేందుకు అందరూ ముందుకు వస్తారు. అలాకాక ఇంకా విదేశీ సంస్థలనే నమ్ముకొని కూర్చొంటే మిగిలిన మూడేళ్ళ పుణ్యకాలం కాస్తా పూర్తిపోతుంది. అప్పుడు “సింగపూర్ వంటి రాజధాని నిర్మించి చూపిస్తా” అనే హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారనే అప్రదిష్ట, విమర్శలు ఎదుర్కోక తప్పదు.