నగరాలే ఆర్ధికాభివృద్ధికి కీలకంగా మారిన తరుణంలో హైదరాబాద్‌లాంటి ఆధునిక చారిత్రక నగరం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రగతి రధ చక్రాలు కుంటుపడే ప్రమాదం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు సకల అవకాశాలను కల్పించగల పట్టణాన్ని, అవశేష ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఆత్మ విశ్వాసంతో తల ఎత్తుకొని తిరిగేలా చేయగల ఒక మహా నగరాన్ని నిర్మించుకోవాల్సిన చారిత్రక కర్తవ్యం ఇవాళ ఆంధ్ర ప్రజల ఎదుట ఉంది.
నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం అనేది పెద్ద లోటు. మరీ ముఖ్యంగా, ఆర్ధిక కార్యకలాపాలకు, వ్యాపార అవకాశాలకు, ఉద్యోగ ఉపాధి కల్పనకు, కళాసాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రబిందువైన హైదరాబాద్ వంటి మహానగరం లేకపోవడం అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతికూలం. నగరాలే ఆర్ధికాభివృద్ధికి కీలకంగా మారిన తరుణంలో హైదరాబాద్‌లాంటి ఆధునిక చారిత్రక నగరం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రగతి రధ చక్రాలు కుంటుపడే ప్రమాదం ఉంది.
ఆంధ్రలో ఆధునిక యుగం మొదలైన నాటి నుంచి అనేక రాజకీయ పరిణామాల కారణంగా పట్టణాలు ప్రాభవం కోల్పోయాయి. నిజానికి ఒకనాడు కోస్తా తీరమంతా రేవు పట్టణాలు ఉండేవి. భీమునిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటివన్నీ ఇలా ఏర్పడినవే. మద్రాసు రేవు పట్టణంగా అభివృద్ధి చెందిన తర్వాత వీటి ప్రాముఖ్యం తగ్గిపోయింది.
మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో పట్టణాల లేమిని గురించి తెలుగువారికి బాధ ఉంది. ఢిల్లీని దేశ రాజధానిగా చేస్తే పంజాబు ప్రగతికి, అభివృద్ధికి ఎంత దోహదం చేస్తుందో ఆంధ్రదేశంలో ఒక రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడి అభివృద్ధికి అంతే తోడ్పడుతుందని 1912లోనే ఆంధ్రులకు ప్రత్యేక ఉనికి కావాలంటూ రాసిన వ్యాసంలో జర్నలిస్టు కె రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు:
The creation of a capital city in Andhra desa will enhance the growth of the Andhras in much the same way as the making of Delhi the capital of India will help the progress and prosperity of the Punjab.
ఆంధ్ర రాష్ట్రం గురించిన ఆలోచనలు మొదలైన తొలిదశలోనే, అంటే 1913లోనే, ఇలా పట్టణాలు లేకపోవడం గురించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రముఖుడు, మద్రాసు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు న్యాపతి సుబ్బారావు పంతులు మాట్లాడారు. మద్రాసు రాష్ట్రంలో తమిళులకు లక్ష జనాభా ఉన్న నగరాలు కనీసం మూడున్నాయని, అరలక్షకు మించిన జనాభా కలిగిన పట్టణాలు ఏడున్నాయని, కాని ఆంధ్రదేశంలో 1901 జనాభా లెక్కల నాటికి లక్ష జనాభా ఉన్న నగరం ఒక్కటి లేదని, అరలక్షకు మించిన జనాభా గల పట్టణం ఒక్కటి మాత్రమే ఉన్నదని ఆయన వాపోయారు.
1956లో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆంధ్రులకు రాజధాని కావడంతో ఈ లోటు చాలావరకు పూడింది. అయితే హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి మరికొన్ని పట్టణాలను అభివృద్ధి చేయడంలో ఆయా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో గతంలో ఉన్న పట్టణాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. 2014 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా గ్రామీణ వ్యవస్థగానే మిగిలిపోయింది.
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 31.16 శాతం పట్టణీకరణ జరిగితే, ఏపిలో దేశ సగటు కంటే తక్కువ పట్టణీకరణ జరిగింది. ఉమ్మడి ఏపిలో 33.9 శాతం పట్టణీకరణ జరగ్గా, అవశేష ఆంధ్రలో ఇది 29.6 శాతం మాత్రమే. అంటే హైదరాబాద్‌ని కోల్పోవడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్ర ఈ విషయంలో బాగా వెనకబడి ఉంది. కేరళలో 47.72 శాతం మంది ప్రజలు పట్టణాల్లో జీవిస్తున్నారు. తమిళనాడు 48.45 శాతం, కర్ణాటక 38.67 శాతం పట్టణీకరణతో ఆంధ్ర కంటే బాగా ముందున్నాయి. తెలంగాణాలో 38.9 శాతం పజలు పట్టణాల్లో జీవిస్తున్నారు. తెలంగాణతో పోల్చినా పట్టణీకరణలో ఆంధ్ర దాదాపు 10 శాతం దిగువలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వంద శాతం పట్టణీకరణ జరిగిన అర్బన్ జిల్లాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా 70.32 శాతం పట్టణ ప్రాంతం. ఆంధ్రలో ఎక్కువ పట్టణీకరణ జరిగిన ప్రాంతాలు విశాఖపట్నం జిల్లా 47.51 శాతం, కృష్ణా జిల్లా 41.01 శాతం మాత్రమే.
పట్టణీకరణతోనే ప్రగతి
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, 55 శాతం మంది ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. అంటే అన్ని దేశాల్లోనూ నగరీకరణ వేగంగా జరుగుతోంది. ఆసియాలో పట్టణీకరణ ప్రస్తుతం అత్యంత వేగంగా జరుగుతోందని ఆసియా అభివృద్ధి బ్యాంకు తెలిపింది. పట్టణీకరణకు, అభివృద్ధి వేగానికి సంబంధం ఉంది. పట్టణీకరణ జరగకుండా ఏ దేశమూ కూడా ఆర్థిక, సామాజిక ప్రగతిని సాధించిన దాఖలా లేదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అనుభవైకవేద్యమే. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ ఎక్కువ. సింగపూర్, హాంకాంగ్, కువైట్ లాంటి చిన్న దేశాలు వంద శాతం పట్టణ ప్రాంతాలుగా మారిపోవడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కాని అభివృద్ధి చెందిన అమెరికా (82 శాతం), కెనడా (82), బ్రిటన్ (83), ఆస్ట్రేలియా (89), దక్షిణ కొరియా (83 శాతం) వంటి పెద్ద దేశాల్లో కూడా ఎనభై శాతానికి పైగా జనం నగరాల్లోనే జీవిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనానే తీసుకుంటే, 64.7 శాతం మంది ప్రజలు నగరాల్లోనే జీవిస్తున్నారు. పైగా ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, అంతర్జాతీయ స్థూల ఉత్పత్తిలో (గ్లోబల్ జీడిపి) 80 శాతం నగరాలలోనే జరుగుతోంది. అంటే నగరాలే అభివృద్ధికి కేంద్రాలుగా, వాహకాలుగా ఉన్నాయి.
ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో నగరాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి హైదరాబాద్‌నే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆదాయంలో సింహభాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించగల నగరం లేదు. 2022 నాటికి తెలంగాణ స్థూల ఉత్పత్తిలో హైదరాబాద్ వాటా దాదాపు 40 శాతం (4.29 లక్షల కోట్లు) కాగా, ఆంధ్ర స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో ఏకైక పెద్ద నగరం విశాఖ వాటా 15 శాతం (1.50 లక్షల కోట్లు) కూడా లేదు.
అంటే తెలంగాణ ఉత్పత్తిలో మూడింట రెండొంతులు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుండగా, ఆంధ్రలో ఉన్న ఏకైక ప్రధాన నగరం నుంచి మూడో వంతు ఉత్పత్తి కూడా రావడం లేదు. దీన్ని బట్టి ఆర్థిక సాధనంగా (ఎకనామిక్ ఇంజిన్) పని చేసే ఒక్క మహా నగరమైనా లేకుండా, ఆ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. అటువంటి నగరం అందించగల లబ్ధిని పొందకుండా ఆ రాష్ట్ర ప్రజలు మెరుగైన తలసరి ఆదాయాన్ని, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవించలేరు.
అందుకే ఆంధ్రలో తలసరి ఆదాయం మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. 2021-22 లెక్కల ప్రకారం పక్కనే ఉన్న తెలంగాణలో ఏడాదికి ప్రతి ఒక్కరూ సగటున 2,78,833 రూపాయల ఆదాయాన్ని పొందుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం 2,07,717 రూపాయలు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకబడి ఉండటానికి చాలా ఇతర కారణాలతో పాటు, హైదరాబాద్ లాంటి ఎకనామిక్ ఇంజిన్ లేకపోవడం ఒక ప్రధాన అంశం.
అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషగా ఇటీవల తెలుగు గుర్తింపు పొందింది. దీనికి కారణం తెలుగువారు పెద్దఎత్తున ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాల బాట పట్టడమే. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలను కల్పించగల పట్టణాలు లేకపోవడం వల్ల, అక్కడి యువత వేరే రాష్ట్రాలకు, దేశాలకు వలసవెళ్లాల్సిన దుస్థితి కలిగింది. ఈ మేధోవలస దీర్ఘకాలంలో ఆంధ్ర సమాజానికి ఎనలేని నష్టాన్ని కలగజేస్తుంది.
అందుకే అన్ని వర్గాల ప్రజలకు సకల అవకాశాలను కల్పించగల పట్టణాన్ని, అవశేష ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఆత్మ విశ్వాసంతో తల ఎత్తుకొని తిరిగేలా చేయగల ఒక మహా నగరాన్ని నిర్మించుకోవాల్సిన చారిత్రక కర్తవ్యం ఆంధ్ర ప్రజల ఎదుట నిలబడింది. ఎనిమిదిన్నర కోట్ల మందికి జీవనాడిగా ఉండిన హైదరాబాద్ మూడున్నర కోట్ల మంది తెలంగాణా ప్రజలకు మాత్రమే రాజధానిగా మిగిలిన తర్వాత, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా అటువంటి మరో డైనమిక్ నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం, అవకాశం ఆంధ్రులకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చింది.
సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన ‘అమరావతి వివాదాలు – వాస్తవాలు’ నుంచి కొంత భాగం. సెప్టెంబరు 8 న విజయవాడలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. మరిన్ని వివరాలు కోసం rameshkandula@substack.com చూడవచ్చు.