నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఇన్నాళ్లూ డిజైన్ల ఎంపికతోనే సమయం సరిపోయింది. అప్పుడెప్పుడో మొదటిసారి తయారు చేయించిన డిజైన్లపై వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆ తరువాత డిజైన్లు తయారు చేసిన కంపెనీని వివిధ కారణాల వల్ల బాధ్యతలు తప్పించడం, మరో కొత్త కంపెనీకి బాధ్యతలు అప్పగింత.. ఈ దశలన్నీ దాటుకుని కొన్ని డిజైన్లను టీడీపీ సర్కారు ఎట్టకేలకు ఖరారు చేసింది. ఈ పనులకు దసరా నుంచి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, డిజైన్లను ఆగస్టు 15లోగా అందజేయాలంటూ నార్మన్ పోస్టర్ సంస్థను సీఎం కోరారు. అమరావతి రాజధాని నిర్మించే అవకాశం రావడం తనకో వరమంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజధాని నగర నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటివి రాష్ట్ర ప్రజల సౌభాగ్యాలకు సూచకాలు అని సీఎం ఈ సందర్భంగా అభివర్ణించారు.
హైకోర్టు భవనానికి స్థూపాకృతి భవనాన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక, పరిపాలనా నగరంలో అసెంబ్లీ, మండలి సముదాయానికి వజ్రాకారంలో ఉండే డిజైన్ ను ఫైనలైజ్ చేశారు. తెలుగు ప్రజలు గతంలో ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయారనీ, ఈ వజ్రాకృతిని చూసి ఆనందిస్తారని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ డిజైన్లపై జరిగిన సమావేశం తరువాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 31 నుంచి అసెంబ్లీ నిర్మాణం పనులు మొదలౌతాయనీ, అక్టోబర్ 15 నుంచి హైకోర్టు భవనం పనులు ప్రారంభమౌతాయనీ, ఆ తరువాత, నవంబర్ తొలి వారం నుంచి సెక్రటేరియట్ బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. నార్మన్ పోస్టర్ సంస్థకు చెందిన ప్రతినిధులు విజయవాడ వచ్చి, వారు తయారు చేసిన ఫైనల్ డిజైన్లను ప్రభుత్వానికి అందించారు. వీటిని కేంద్ర ప్రభుత్వం పెద్దలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కాబోయే రాష్ట్రపతితోపాటు పలువురు ఢిల్లీ పెద్దలకు ఈ డిజైన్లకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిజానికి, ఈ డిజైన్ల ఎంపిక అనేది ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యవహారం. రకరకాల కారణాల వల్ల తాత్సారం జరుగుతూ వచ్చింది. దాంతో నిర్మాణం పనులు కూడా ముందుకు కదలని పరిస్థితి. ఏదైతేనేం ఇన్నాళ్లకు ఒక కొలీక్కి వచ్చింది. దసరా నుంచి పనులు ప్రారంభం అంటున్నారు. ఆ పనుల ప్రారంభ కార్యక్రమాన్ని కూడా మరోసారి ఆర్భాటంగా నిర్వహిస్తారేమో! వచ్చే ఎన్నికల్లో అమరావతి నిర్మాణం ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి, దసరా నుంచి మొదలైన పనులు మరో ఏడాదిన్నరలోగా ఎంత వేగంగా సాగుతాయో వేచి చూడాల్సిందే.