భారత ప్రధాని నరేంద్ర మోది ఈనెల 22వతేదీన శంఖుస్థాపన చేస్తున్న రాజధాని అమరావతిని ప్రపంచంలోనే 10అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శంఖుస్ధాపన కార్యక్రమం ముగిశాక రాజధాని నిర్మాణం నిరంతరాయంగా కొనసాగుతుందని, ముందుగా రోడ్ల నిర్మాణం మొదలౌతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాజధాని నిర్మాణానికి అసేతు హిమాచలం నుండి సేకరించిన మట్టి,నీరును రాజధాని ప్రాంతంమంతటా హెలీకాప్టరు ద్వారా చల్లించేందుకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి నివాసం వద్ద బుధవారం ఉండవల్లిలోని ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన రాజధాని అమరావతిని ఒక అద్బుతమైన శక్తివంతమైన రాజధానిగా తీర్చిదిద్ది ప్రపంచంలోని మొదటి పది అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా దీనిని అభివృద్ది చేయనున్నట్టు స్పష్టం చేశారు.
యావత్తు భారతావనితో పాటు జీసెస్ క్రీస్తు జన్మస్థలమైన జెరూసలెం,మహ్మద్ ప్రవక్త జన్మ స్థలం మక్కా వంటి ప్రాంతాల నుండి మహాత్మాగాంధీ,నెహ్రూ,బిఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన ప్రాంతాల నుండి కూడా సేకరించిన మట్టిని,నీటిని రాజధాని ప్రాంతమంతటా హెలీకాప్టర్ ద్వారా చల్లడాన్ని ఆయా స్థలాలు,పుణ్యక్షేత్రాల పవిత్రతను అమరావతికి ఒక ప్రతీకగా ఆపాదించడమేనని ముఖ్యమంత్రి భావించారు.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి యావత్తు భారతావనిలోని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం,కాశ్మీర్ లోని వైష్ణాదేవి ఆలయ ప్రాంగణం,మానస సరోవర్,అజ్మీర్ దర్గా,మౌంట్ అబు,తిరుమల బంగారు బావి నుండి సేకరించిన పవిత్ర మట్టిని,జలాలను తీసుకురావడం జరిగిందని సియం చంద్రబాబు పేర్కొన్నారు.అలాగేరాష్ట్రంలోని 13వేల గ్రామాలు,3వేల వార్డుల నుండి ఆయా పుణ్య,క్షేత్రాలు,ఇతర ముఖ్య ప్రాంతాల నుండి పవిత్ర మట్టి,జలాలను ప్రత్యేక పూజలు,సర్వమత ప్రార్ధనలు చేయించి తీసుకువచ్చి రాజధాని నిర్మాణం ప్రాంతంలో హెలీకాప్టర్ ద్వారా వెదజల్లుతున్నామన్నారు.
మట్టి,జలాలను కొంత మేరకు రాజధాని ప్రాంతమంతటా చల్లించి మిగతా మట్టి,నీటిని 25ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.