మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిధిలో కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. తన నియోజకవర్గాన్ని ముక్కూ ముఖం తెలియని.. డబ్బుందన్న కారణంగా తోసుకొచ్చేసిన మలసాల భరత్ అనే నేతకు త్యాగం చేసేసిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన మంత్రే అయినా అధికార విధులు నిర్వహించే అధికారం లేదు. ఏదైనా నియోజకవర్గానికి వెళ్లి ఎన్నికల పనులు చేసుకుందామమంటే… నియోజకవర్గం లేదు. అందుకే ప్రతి రెండు రోజులకు ఓ సారి మీడియా ముందుకు వచ్చి జగన్ రెడ్డి తన తల రాత రాస్తారని.. ఆయనే తనకు దేవుడని చెప్పుకుంటున్నారు. అలా అయినా తనను గుర్తిస్తారని ఆశ పడుతున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటుకు ఆయన పేరు తెరపైకి తెస్తున్నా.. అదంతా గిలిగింతలు పెట్టడానికేనని జగన్ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పటికే వేరే వారికి రిజర్వ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అమర్నాథ్ కు సీటు విషయంపై అధికారిక ప్రకటన చేయడం లేదు. ఏదో ఓ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రతీ జాబితా విషయంలోనూ ఆయన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా పిలుపురావడం లేదు. దీంతో అమర్నాథ్ .. మరింత ఆందోళన చెందుతున్నారు.
చివరికి పవన్ కల్యాణ్ విశాఖలో ఏదైనా నియోజవకర్గం నుంచి పోటీ చేస్తే.. ఆయనపై పోటీకి పెట్టి బలి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని.. అలాకాకపోతే ఈ సారి పార్టీకి పని చేయాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గుడివాడ అమర్నాథ్కు మరో చాయిస్ లేదు. ఆయనను ఏ పార్టీలోకి రానివ్వరు. అంత నోటి దురుసు ఆయన చూపించారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చెబితే అది చేయాల్సిందే. అందుకే ఆయన దేవుడని..తన తల రాత రాస్తాడని చెప్పుకొస్తున్నారు. కానీ జగన్ రెడ్డి … ఓ కాపు నేతను బలంగా ఎదిగేందుకు అసలు సహకరించరు. కాపు నేతే కాదు.. ఏ నియోజకవర్గంలోనూ ఇతర నేతలు ఎదిగేందుకు ఆయన అంగీకరించరు. ఒక సారి గెలిస్తే కత్తిరంచేస్తారు. ఇప్పుడు అమర్నాథ్కూ అదే జరుగుతోంది.