విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ జిల్లా వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షని నిన్న రాత్రే పోలీసులు భగ్నం చేసి నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. సాధారణంగా ఇటువంటి దీక్షలను అవి చేసే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐదారు రోజులకి మించి చేయనివ్వరు కనుక ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే ఐదారు రోజుల నిరాహార దీక్షగా మారిపోయింది. ఐదారు రోజుల తరువాత అమర్నాథ్ దీక్షని పోలీసులు భగ్నం చేస్తే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్షకు కూర్చొంటారని పార్టీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఒకటి రెండుసార్లు ప్రకటించారు. కానీ వారు ఊహించని విధంగా పోలీసులు నిన్న రాత్రే అమర్నాథ్ దీక్షని భగ్నం చేసి వైకాపాకి పెద్ద షాక్ ఇచ్చారు.
ఆసుపత్రిలో తన దీక్షని కొనసాగిస్తున్న అమర్నాథ్ ని పరామర్శించేందుకు సోమవారం వైజాగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిమ్మరసం త్రాగించి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షరా మామూలుగానే తన ప్రియ శత్రువు చంద్రబాబు నాయుడుని ఈ అంశంతో సహా దీనితో ఏమాత్రం సంబంధం లేని అనేక అంశాల గురించి ప్రస్థావిస్తూ చంద్రబాబు నాయుడిని చాలా తీవ్రంగా విమర్శించారు. రైల్వే జోన్ కోసం తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని మాత్రం ప్రకటించారు కానీ తను దీక్షకి కూర్చోబోతున్నట్లు నిర్దిష్టంగా ప్రకటించలేదు. కనీసం పార్టీలో చర్చించుకొని తరువాత తేదీని ప్రకటిస్తానని కూడా అనలేదు. బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు మాట మార్చి అన్ని పార్టీలను కలుపుకొని తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పి ఊరుకొన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొంటే ఆరు రోజుల వరకు ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. అటువంటి పరిణామాన్ని ఊహించకపోవడంతో జగన్, వైకాపా నేతల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. దీక్షని భగ్నం చేయించుకోవడానికి వేరే దారిలేక చివరికి వైకాపా ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆలోచించినట్లు వార్తలు వచ్చేయి. కానీ అప్పుడు వారిలో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు నిరాకరించవచ్చని లేదా పార్టీ ఫిరాయించవచ్చనే అనుమానం కలగడంతో ఆ ఆలోచనను విరమించుకొన్నారు. ఆ తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోలీసుల చేత దీక్ష భగ్నం చేయించుకొన్నట్లు వార్తలు వచ్చేయి.
బహుశః ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వైకాపాని, జగన్మోహన్ రెడ్డి వెంటాడుతూనే ఉన్నాయేమో? అందుకే ఈసారి ఆమరణ నిరాహార దీక్షకి ఊసెత్తకుండా, కనీసం ఆ ప్రస్తావన కూడా చేయకుండా మిగిలిన అన్ని విషాయల గురించి జాగ్రత్తగా మాట్లాడి వెళ్లిపోయినట్లున్నారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇటువంటి దీక్షలు తను మాత్రమే చేయాలని భావించే జగన్మోహన్ రెడ్డి ఈసారి అమర్నాథ్ కి ఆ అవకాశం కల్పించడం ఒక విచిత్రమనుకొంటే, అమర్నాథ్ కి తనే స్వయంగా నిమ్మ రసం ఇచ్చి ఆయన చేత దీక్ష విరమింపజేయడం మరో విచిత్రం.
ఇదివరకు రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా కోసం కొన్నాళ్ళు పోరాడి మధ్యలోనే చేతులు ఎత్తేసారు. ప్రత్యేక హోదా గురించి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు కానీ మళ్ళీ ఎన్నడూ ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు రైల్వే జోన్ కోసం నాలుగు రోజుల దీక్ష చేసి దీనిపై కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెపుతున్నారు!