సన్నబియ్యం ఇస్తామని సంచులు కూడా రూ. ఏడువందల కోట్లు పెట్టి చేయించిన తర్వాత ” సన్నబియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా ?” అని దబాయించిన ఘన చరిత్ర ఉన్న వైసీపీ మంత్రులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మద్యనిషేధం చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఈ వాదనతో తెర ముందుకు వచ్చారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పామని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు.
చంద్రబాబును తిట్టేందుకు మీడియా సమావేశం పెట్టిన ఆయన .. వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలుచేసినట్లుగా తెలుస్తోంది. మద్యనిషేధం చేస్తామని చెప్పలేదని.. ధరను స్టార్ హోటళ్లలో మాదిరి షాక్ కొట్టేలా పెంచుతామని మాత్రమే చెప్పామన్నారు. అలాగే చేశామని అంటున్నారు. అందుకే తాగేవాళ్లు తగ్గారు.. ఆదాయం పెరిగిందని కవర్ చేసుకున్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చూసి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే కొడాలి నాని సన్న బియ్యం విషయంలో చెప్పినట్లుగా కాకుండా కాస్త పద్దతిగానే గుడివాడ ఆమర్నాథ్ చెప్పారు. ఇవాళ కాకపోతే రైపైనా వైసీపీ ఇదే వాదనతో ప్రచారం హోరెత్తించడం ఖాయమని కొద్దిరోజులుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది.
ఎందుకంటే మద్యనిషేధం పేరుతో ధరలను పెంచివిపరీతంగా దోచుకోవడమే కాకుండా ఇప్పుడు .. మందు బాబుల్ని పాతికేళ్ల పాటు తాకట్టుపెట్టేశారు. వచ్చే ప్రభుత్వాలుకూడా మద్యం రేట్లు తగ్గించలేని విధంగా చేశారు. ఇప్పుడు బార్లను పెంచుతున్నారు. అందుకే… మద్యనిషేధం చేస్తామనిచెప్పలేదని ఆ హామీని తాము ఇవ్వలేదని చెప్పడానికి ఇప్పుడు ఎదురుదాడి అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు గుడివాడతో ప్రారంభమైనా.. రేపు సీఎం కూడా ఇదే మాట చెప్పడానికి అవకాశం ఉంది.