కరోనా ఎఫెక్ట్ చిత్రసీమపై భారీగా పడింది. షూటింగులు లేవు. థియేటర్లో సినిమాలూ లేవు. అంతా ఇంటి పట్టునే ఉన్నారు. వాళ్లందరికీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్సే వినోద సాధనాలు. ఈ సమయాన్ని తనకు అనుగుణంగా సద్వినియోగపరచుకోవడంలో సఫలీకృతం అవుతోంది అమేజాన్. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలన్నీ ఇప్పుడు ఆమేజాన్లో కనిపిస్తున్నాయి. మార్చి 6న విడుదలైన ఓ పిట్టకథ, అనుకున్నదొకటీ – అయినది ఒక్కటీ లాంటి సినిమాలు ఇప్పుడు అమేజాన్లో దర్శనమిస్తున్నాయి. విడుదలైన రెండు వారాలకే ఇప్పుడు ఇవి అమేజాన్లో కనిపించడం విశేషం.
నిజానికి చిన్న సినిమాల్ని కొనుగోలు చేయడంలో అమేజాన్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమేజాన్లో చాలా పెద్ద సినిమాలున్నాయి. వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కావల్సినంత కంటెంట్ మూటగట్టి ఉండడంతో.. అసలు చిన్న సినిమాల్ని కొనడం లేదు. అయితే ఇప్పుడు టోకుగా సినిమాలన్నీ అమేజాన్ లోనే దర్శనమిస్తున్నాయి. `మా సినిమాని కొనండి ప్లీజ్` అంటూ అమేజాన్ చుట్టూ తిరిగిన నిర్మాతల్ని ఏమాత్రం పట్టించుకోని ఆ సంస్థ ఇప్పుడు పిలిచి మరీ సినిమాల్ని తీసుకుంటోంది. అయితే.. సినిమాల్ని మాత్రం కొనడం లేదు. అంతా రెవిన్యూ షేర్ మీదే. ఆ సినిమా ఆమేజాన్లో ఎంతమంది చూశారు? ఎంత సేపు చూశారు? అనే అంకెని బట్టి రెవిన్యూ పంచబోతోంది అమేజాన్. ఓ రకంగా ఇది ఉభయతారకం. అసలు తమ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో అమ్ముడుపోలేదన్న బాధ నిర్మాతలకు ఉండదు. చిన్న సినిమాని కొన్నామన్న అసంతృప్తి అమేజాన్కూ ఉండదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం… థియేటర్ వరకూ వెళ్లి చూడలేకపోయిన కొన్ని చిన్న సినిమాలు ఇప్పుడు అమేజాన్లో ఫ్రీగా చూసేయొచ్చు.