అమెజాన్ గిఫ్టు కార్డుల విషయంలో ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తూండటంతో అమెజాన్ స్పందించింది. అమెజాన్ పే నుంచి అధికారికంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమెజాన్ కో బ్రాండెడ్ గిఫ్టు కార్డుల విషయంలో లక్షలాది మంది కస్టమర్లు సంతృప్తిగా ఉన్నారని తెలిపింది. గిప్ట్ కార్డులు ఒక్క అమెజాన్లోనే కాకుండా పదివేలకుపైగా యాప్స్‌లో రీడిమ్ చేసుకోవచ్చని తెలిపింది.
అదే సమయంలో గిఫ్ట్ కార్డులు ఎక్స్ పైర్ అయ్యే సమయంలో కొనుగోలుదారులకు రెండు సార్లు రిమైండర్ పంపుతామని తెలిపింది. అయినప్పటికీ ఎక్స్ పైర్ అయిన తర్వతా కూడా చాలా సులువైన పద్దతుల్లో కస్టమర్ కేర్ ను సంప్రదించి రియాక్టివేట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అమెజాన్ పే తెలిపింది. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు పెట్టిన అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని తెలిపింది.
గిఫ్ట్ కార్డులు ఏడాది తర్వాత ఎక్స్ పైర్ అవుతున్నాయని దీని వల్ల తన కార్యాలయం కూడా సమస్య ఎదుర్కొందని పవన్ కల్యాణ్ అంటున్నారు. డబ్బులు ఎంత ఈజీగా లోడ్ చేసుకుంటున్నారో అంత ఈజీగా ఎక్స్ పైర్ అయితే ఎందుకు వెనక్కి ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. పవన్ పెట్టిన రెండు ట్వీట్లు వైరల్ కావడంతో అమెజాన్ క్లారిటీ ఇచ్చింది.