తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు మరో పెద్ద దెబ్బ. ఇది వరకు దాదాపు 3600 థియేటర్లుండేవి. అవి కాస్త 16 వంలకు పడిపోయాయి. త్వరలోనే ఈ థియేటర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్ లోనే దాదాపు 10 థియేటర్లు మూతబడ్డాయి. షాపింగ్ కాంప్లెక్సులుగా మారిపోయాయి. ఇప్పుడు మరిన్ని థియేటర్లు గొడౌన్లుగా మారే అవకాశం ఉంది. తాజాగా అమేజాన్ సంస్థ సింగిల్ స్క్రీన్లపై కన్నేసింది. వాటిని తన గొడౌన్లుగా మార్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే దాదాపు 30 థియేటర్లను అమేజాన్ సొంతం చేసుకోబోతోందని, అవి త్వరలోనే అమేజాన్ గొడౌన్లుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
సౌత్ ఇండియాకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ చేసుకుంది అమేజాన్. వివిధ ప్రాంతాలకు సరుకు సప్లై చేసుకోవడానికి, దిగుమతి చేసుకోవడానికి అమేజాన్కి కొన్ని గొడౌన్లు అవసరం అయ్యాయి. అందుకే మూతబడడానికి రెడీగా ఉన్న కొన్ని థియేటర్లను ఎంచుకుంది. ప్రస్తుతం థియేటర్ యజమానులతో అమేజాన్ ప్రతినిథులు సంప్రదింపులు జరుపుతున్నారు. థియేటర్ నిర్వహించి, సినిమాలు ఆడించుకుంటే వచ్చే అద్దె కంటే ఎక్కువ అద్దె చెల్లించడానికి అమేజాన్ సిద్ధమైందని, అందుకే థియేటర్ యజమానులు సైతం, అమేజాన్కి లీజుకి ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అమేజాన్ ఒక్కటే కాదు. మోర్, డీ మార్ట్ వంటి వాణిజ్య సంస్థలు సైతం గొడౌన్లుగా థియేటర్లనే ఎంచుకోవడానికి సిద్ధ పడుతున్నాయి.
తెలంగాణ థియేటర్ యాజమాన్య సంఘ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కూడా.. ఇదే విషయాన్ని ధృవీకరించారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 200 థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని, వాటిలో చాలా వాటికి అమేజాన్, డీ మార్ట్ లాంటి సంస్థలు గొడౌన్లుగా మార్చుకోనున్నాయని ఆయన తెలిపారు. లాక్ డౌన్కి ముందు, ఆ తరవాత.. పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడుతున్నారని, ఇలాంటి సమయాల్లో థియేటర్ల నిర్వహణ చాలా కష్టంతో కూడిన విషయమని, దాంతో పాటు.. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు రంగంలోకి దిగి సింగిల్ స్క్రీన్ థియేటర్లని తమ సరుకుల్ని దాచుకునే గొడౌన్లుగా మార్చుకునే ప్రయత్నాలు మొదలెట్టాయని ఆయన తెలిపారు.