ఈమధ్య అమేజాన్ ప్రైమ్ కి దెబ్బలు మీద దెబ్బలు తగిలాయి. భారీ సినిమాలు కొని బోల్తా పడింది. పెంగ్విన్, వి, నిశ్శబ్దం.. వీటిలో ఏ ఒక్కటీ అమేజాన్ ప్రైమ్ కి ప్లస్ పాయింట్లు కాలేకపోయాయి. కొన్నాళ్ల పాటు అమేజాన్ తెలుగు సినిమాలవైపు చూడదనుకున్నారంతా. అయితే… ఇప్పుడు `మిడిల్ క్లాస్ మెలోడీస్` సినిమాని సొంతం చేసుకుంది.వచ్చే నెల 20వ తేదీన ఈ సినిమా అమేజాన్ లో ప్రదర్శితం కానుంది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పేరుకి తగ్గట్టు మీడియం రేంజు బడ్జెట్ సినిమా. తక్కువ రేటుకి అమేజాన్ కొనేసి ఉంటుందనుకుంటున్నారంతా. నిజానికి ఈసినిమా కోసం 4.5 కోట్లు వెచ్చిందిందని టాక్. తొలి సినిమా `దొరసాని` ఆడకపోయినా రెండో సినిమాని అమేజాన్ ఇంత రేటుతో కొనేసిందంటే విశేషమే మరి. అయితే ఈసారి అమేజాన్ ఊరకే ఈ సినిమా కొనలేదు. అమేజాన్ ప్రతినిథులు ఈ సినిమా చూసి, `బాగుంది` అని స్టాంప్ వేశాకే.. అమేజాన్ ఇంత రేటు వెచ్చించిందని టాక్. ఇది వరకు సొంతం చేసుకున్న మూడు సినిమాలూ కేవలం కాంబినేషన్, క్రేజ్చూసి సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం కాస్త ముందు జాగ్రత్త వహించి, శాటిలైట్ ఛానల్ లా ఆలోచించి, కొనుగోలు చేసింది. ఓటీటీలో విడుదల చేస్తే సినిమా ఫ్లాపే అనే ఓ ముద్ర పడిపోయింది. దాన్ని `మిడిల్ క్లాస్ మెలోడీస్` అయినా పోగొడుతుందేమో చూడాలి.