Ambajipeta marriage band movie review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
-అన్వర్
రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయేవాళ్లు ఉంటారు. సినిమా సినిమాకీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఎదుగేవాళ్లూ ఉంటారు. సుహాస్ రెండో రకం. కలర్ ఫొటోకి ముందు సుహాస్ హీరో ఏంటి? అనుకొన్నారు. రైటర్ పద్మభూషణ్ వచ్చేటప్పుడు ‘ఈసారి సుహాస్ ఏం చేసి ఉంటాడో చూద్దా’మన్నంత ఆసక్తి కలిగింది. ఇప్పుడు ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’కి వచ్చేసరికి సరికి పెయిడ్ ప్రీమియర్ షోలు పడేంత స్థాయి వచ్చింది. అదే ఎదుగుదల అంటే! రెగ్యులర్ కథలు ఎంచుకోకుండా, విభిన్నమైన పాత్రలతో తన పునాదుల్ని పటిష్టం చేసుకొంటున్న సుహాస్… ఈసారి కూడా మోత మోగించాడా? అంబాజీ పేట ఎలాంటి కథ? ఇందులో సుహాస్ ఎంత ఇంప్రెస్ చేశాడు?
అది అంబాజీపేట. క్వాయిన్ బాక్సుల కాలం. ఆ ఊర్లోని మ్యారేజీ బ్యాండులో మల్లి (సుహాస్) ఓ సభ్యుడు. నాన్నది సెలూన్ షాపు. అక్క పద్మ (శరణ్య) స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటుంది. ఆ ఊరికి వెంకట్ పెద్ద మనిషి టైపు. తనకంటే తక్కువ వాళ్లని చిన్న చూపు చూసే రకం. వెంకట్ చెల్లాయి లక్ష్మి (శివానీ నాగారం)ని మల్లి ఇష్టపడతాడు. లక్ష్మి కూడా మల్లిని ఇష్టపడుతుంది. విషయం తెలుసుకొన్న వెంకట్.. మల్లి కుటుంబంపై పగ పడతాడు. పద్మ, మల్లిలను దారుణంగా అవమానిస్తాడు. మరి అందుకు ప్రతీకారంగా మల్లి ఏం చేశాడు? తన కోపాన్ని, పగని ఎలా చల్లబరచుకొన్నాడు? అనేది మిగిలిన కథ!
నాలుగు లైన్లలో సింపుల్ గా తెమిలిపోయిన కథ ఇది. కథగా చూస్తే ఎన్నో వందల సినిమాలు గుర్తొస్తాయి. ఇలాంటి సినిమాల్లో కథ కంటే, సంఘర్షణ, సన్నివేశాల అల్లిక, నటీనటుల ప్రదర్శన అత్యంత కీలకం. ఈ విభాగాల్లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు కొంచెం గట్టిగానే సౌండ్ చేసింది. మల్లి, లక్ష్మిల ప్రేమకథతో ఈ సినిమా మొదలవుతుంది. మల్లిని లక్ష్మి ఎందుకు ఇష్టపడింది? అంతగా మల్లిలో ఏముంది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. బహుశా సమాధానం అవసరం లేదేమో? ఎందుకంటే… ఆ రోజుల్లో పుట్టిన టీనేజీ లవ్ స్టోరీలు అలానే ఉంటాయ్. లాజిక్కులు లేకుండా. రాసుకొనే ప్రేమ లేఖల్లో కూడా పెద్ద మేటరేం ఉండదు. ‘నువ్వు నాకు నచ్చావు. నేను కూడా నచ్చితే రేపు తెల్ల చొక్కా వేసుకురా..’ అనేంత సింపుల్‌గా ఉంటాయ్. అలాంటి సన్నివేశాలు నాస్టాలజీ ఫీలింగ్ తీసుకొస్తాయి.
‘యమ్మా….’ అనే పాటలో బీట్ బాగుండడంతో హుషారుగా సాగిపోయి, కథలో ఏం లేకపోయినా – కాస్త ఊపొస్తుంది. మధ్యమధ్యలో వెంకట్ ఆధిపత్యం చెలాయించాలని చూడడం, జాతి తారతమ్యాలు గుర్తు చేయడం… ఇవన్నీ తమిళ ఫ్లేవర్‌లో సాగే సన్నివేశాలుగా కనిపిస్తాయి. లవ్ స్టోరీ నుంచి రావాల్సిన సంఘర్షణని, అక్క పాత్ర నుంచి తీసుకొచ్చాడు దర్శకుడు. దాంతో ఎమోషన్ ఇంకాస్త బలంగా మారింది. ఇంట్రవెల్ ముందొచ్చే సన్నివేశాలతో కథలో సీరియస్‌నెస్ వస్తుంది. అవమాన భారంతో హీరో ఏం చేశాడు? అక్కకు జరిగిన అన్యాయంపై ప్రతీకారం ఎలా తీర్చుకొంటాడు? తన ప్రేమని ఎలా గెలుచుకొంటాడు? అనే ప్రశ్నల్ని లేవనెత్తి అక్కడ విశ్రాంతి కార్డు వేశాడు.
‘పరువుకి పరువే సమాధానం..’ అనే డైలాగ్‌ని ఓ పాత్రతో ఓ పాత్రతో పలికించాడు దర్శకుడు. అక్కడ దర్శకుడు కొత్తగా ఆలోచించాడన్న ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌లో ఈ కథ బలమైన ఎత్తుగడతో ప్రారంభం అవుతుందేమో? అనే భరోసా వస్తుంది. అయితే విలన్ ఇంటి ముందు హీరో కుటుంబం టెంట్ వేసుకొని కూర్చుంటుంది. దాంతో కథ కూడా అక్కడే ‘కూర్చుండిపోయిన’ ఫీలింగ్ వస్తుంది. అసలు.. అక్కడే దర్శకుడు అవుటాఫ్ బాక్స్ ఐడియాతో రావాల్సింది. మౌనపోరాటం లాంటి కాన్సెప్టుని పట్టుకోవడం వల్ల ఒరిగిందేం ఉండదు. దాన్ని కూడా మధ్యమధ్యలో ఇష్టం వచ్చినట్టు వాడిన ఫీలింగ్ కలుగుతుంది. పెళ్లి కోసం మౌన పోరాటానికి బ్రేక్ ఇవ్వడం, అదే పెళ్లిలో హీరో బ్యాండ్ మేళం వాయించడానికి ఒప్పుకోవడం ఇవన్నీ క్యారెక్టరైజేషన్‌ని, మూడ్ ని దర్శకుడు తన చిత్తానికి తిప్పుకొన్న భావన కలిగిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం మళ్లీ ఊపిరి పోస్తుంది. రివోల్డ్ అనేది అమ్మాయి వైపు నుంచి వస్తే – ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉంటుందో చూపించిన సీన్ అది. అక్కడ్నుంచి ముగింపు వరకూ.. అదే హై కనిపిస్తుంది. ముగింపులో దర్శకుడు ఏదో కొత్తగా ఆలోచించాన్న భావన కలిగించాడు. అయితే… ఈ ముగింపు చాలా మందికి పూర్తి సంతృప్తి కలిగించకపోవొచ్చు. మరీ సినిమాటిక్‌గానూ అనిపించవచ్చు. గుర్తుండిపోయే క్లైమాక్స్ రాసుకొని ఉంటే – బ్యాండ్ మోత మరింత గట్టిగా వినిపించే ఆస్కారం దక్కేది. ప్రాణం తీసినంతమాత్రాన పోయిన పరువు రాదు. చరిత్ర కూడా చంపినవాడ్ని నేరస్థుడిగా, చచ్చినవాడ్ని మహోన్నతుడిగా గుర్తిస్తుందేమో అనే భయం. అందుకే మధ్యే మార్గం ఎంచుకొన్నాడు దర్శకుడు.
సుహాస్‌లో రెండు కోణాలు కనిపించాయి. తొలి సగంలో అల్లరి అబ్బాయిగా ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో ఇంటెన్సిటీ కనిపించింది. ప్రతీకారంతో ఊగిపోయే సన్నివేశాల్లో, తన ప్రేమని వదులుకోవాల్సివచ్చిన సన్నివేశంలో.. ఇలా చాలా సార్లు సుహాస్‌లోని నటుడు మంచి మార్కులు కొట్టేశాడు. శివానీ నాగారం ది హీరోయిన్ ఫేస్ కట్ కాదు. పక్కింటి అమ్మాయిలా ఉంటే సరిపోతుందిలే అని అనుకొని ఆమెని ఎంచుకొన్నట్టు అనిపించింది. అయితే నటన పరంగా వంక పెట్టలేం. శరణ్య మాత్రం సుహాస్ కంటే ఎక్కువ నచ్చుతుంది. తనలోని నటన ఒక ఎత్తయితే, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం మరో ఎత్తు. అంత ధైర్యం, తెగువ, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి పాత్రలు రాసుకొన్నప్పుడు సహజంగానే ఆ పాత్రలతో ప్రేమలో పడిపోతాం. ఇక్కడా అదే జరిగింది. విలన్లో క్రూరత్వం అడుగడుగునా కనిపించింది. మంచి నటుల్ని ఎంచుకొని, వాళ్ల నుంచి దర్శకుడు తనకు కావల్సిన నటన రాబట్టుకొన్నాడనిపించింది.
శేఖర్ చంద్ర మాస్ బీట్లూ చేయగలడు అని ‘యమ్మా’ అనే పాట నిరూపించింది. అలాంటి పాట మరోటి ఉంటే… ఇంకా బాగుండేది. బహుశా.. స్కోప్ దొరకలేదేమో? బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ శేఖర్ చంద్ర తన శైలి మార్చుకొన్నాడు. మాటలు సహజంగా ఉన్నాయి. ‘అమ్మాయి వెంట పడడంలో చూపించే మగతనం, ఆపదలో ఉన్న అమ్మాయి వెనుక నిలబడేటప్పుడూ చూపించాలి’ అనే డైలాగ్ బాగుంది. చిన్న సినిమానే అయినా క్వాలిటీ మేకింగ్ కనిపించింది. సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. ఇలాంటి కథలు రాసుకోవడంలో కాదు. తీయడంలో ధైర్యం ఉండాలి. కంటెంట్‌ని నమ్మితే కానీ, ఇలాంటి కథలు పట్టాలెక్కవు. దర్శకుడిలో విషయం ఉంది. అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా. తొలి సగంలో కుర్రకారుని అలరించి, సెకండాఫ్‌లో ఎమోషన్‌తో నడిపాడు. అయితే క్లైమాక్స్ సీన్లో ఏం జరిగిందో, అది ఇంట్రవెల్ కే అయిపోవాలి. కానీ ఆ ఎమోషన్ని క్లైమాక్స్ వరకూ ఆపాడు దర్శకుడు. అలా ఆపడానికి ఓ బలమైన కారణమో, లాజిక్కో వేసుకోగలిగితే – ఈ సినిమా మరింత రక్తి కట్టేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. సన్నివేశాల అల్లిక, నటీనటుల ప్రతిభ ‘అంబాజీ పేట’ని కాపు కాశాయి. ఈ వీకెండ్లో మీ రెండు గంటల టైమ్ కేటాయించడానికి ఏమాత్రం మొహమాట పడాల్సిన పనిలేని సినిమా ఇది.
తెలుగు360 రేటింగ్ : 2.75/5
-అన్వర్