చిన్న చిన్న పాత్రలు చేసుకొంటూ, హీరోగా మారాడు సుహాస్. నిజానికి హీరో కటౌట్ ఏమాత్రం లేకపోయినా, తన ప్రతిభతోనే హీరో స్థాయికి ఎదిగాడు. తను ఎంచుకొనే పాత్రలు, కథలూ కూడా వైవిధ్యంగానే ఉంటున్నాయి. అందుకే విజయాలు దక్కించుకొంటున్నాడు. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే, ప్రేక్షకులు.. పరిశ్రమ సీరియస్‌గానే ఓ లుక్ వేస్తోంది. ఆ నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు సుహాస్ నుంచి ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ విడుదలకు సిద్ధమైంది. రేపే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకి అన్ని వైపుల నుంచీ పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ రావడం – పెయిడ్ ప్రీమియర్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం శుభ శకునం.
ఫిబ్రవరి 2న ఏకంగా 8 సినిమాలు వస్తున్నాయి. అయితే… ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సినిమా మాత్రం `అంబాజీ పేట`. టైటిల్ క్యాచీగా ఉంది. పైగా టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. ‘గుమ్మా’ అనే పాట జనంలోకి వెళ్లిపోయింది. ఇండ్రస్ట్రీ సపోర్ట్ కూడా ఈ సినిమాకి ఎక్కువగానే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, అడవిశేష్ లాంటి క్రేజీ హీరోలు ఈ సినిమాని తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండ్రస్ట్రీలోకి కొంతమందికి ఈ సినిమా చూపించారు. వాళ్ల నుంచి కూడా పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడమే కాదు. బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లని కూడా అందుకొన్నాయి. అంబాజీ పేటతో అదే మ్యాజిక్ రిపీట్ అయితే, సుహాస్ హీరోగా హ్యాట్రిక్ కొట్టినట్టే.