హైదరాబాద్: దీరూభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత వ్యాపారాలలో విభేదాలు రావటంతో రిలయన్స్ సామ్రాజ్యాన్ని ముకేష్, అనిల్ అంబానీలు 2005 సంవత్సరంలో పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన అంబానీ సోదరులు మళ్ళీ చేతులు కలిపారు. 4జీ మొబైల్ ఫోన్ సేవల వ్యాపారం విషయంలో అన్న ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ – స్పెక్ట్రమ్ ట్రేడింగ్, షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకోబోతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఒప్పందం ఖరారవుతుందని అనిల్ అంబానీ నిన్న ఆర్‌కామ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చెప్పారు. ఈ ఒప్పందం భారీ టెలికామ్ రంగంలో మరో భారీ మార్పుకు సంకేతమని అన్నారు. దీనిద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఈ ప్రయోజనాలు రానున్న రోజుల్లో కనిపిస్తాయని చెప్పారు. ఇరు సంస్థలూ కలిసి సంయుక్తంగా అత్యుత్తమ ప్రమాణాలతోకూడిన సర్వీసులు అందిస్తాయని అన్నారు. ఈ ఒప్పందం తర్వాత ఆర్‌కామ్ కస్టమర్లకు ఆర్‌జియోకు చెందిన 4జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని, అలాగే ఆర్‌కామ్‌కు ఉన్న 800-850 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఆర్‌జియో ఉపయోగించుకుంటుందని తెలిపారు. పెద్దమనసుతో సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించినందుకు అన్నయ్య ముకేష్‌కు తాను కృతజ్ఞుడినై ఉంటానని అనిల్ చెప్పారు. సర్వసభ్య సమావేశానికి అనిల్ భార్య టీనా, తల్లి కోకిలాబెన్ కూడా హాజరయ్యారు.