ఏపీలో పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అపారమైన వనరులు, తీరప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టబుడులను భారీగా సాధించాలన్న లక్ష్యంతో అమరావతి వేదికగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలను ఆహ్వానించారు. 35 దేశాలకు చెందిన సుమారు 40 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్ జనరల్స్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది
రాయబారులకు ఏపీ వనరులపై ప్రజెంటేషన్..!
ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు ఏపీలో ఉన్న వనరులను, పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. నవరత్నాల పథకాల్లోని వివిధ అంశాలపై పెట్టుబడులకు ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలు ఆసక్తి కనపరిచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఒకేచోట 35 దేశాలకు చెందిన రాయబారులు సమావేశం కావటం దేశంలోనే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.. సదస్సు ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత 13 మంది రాయబారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, అవినీతి రహిత నినాదంతో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నది ముఖ్యమంత్రి వారికి వివరించనున్నారు.
నవరత్నాల్లో పెట్టుబడలకు పలు దేశాల ఆసక్తి..!
ఫార్మా, ఆటోమోబైల్, స్టీల్, టెక్స్ టైల్స్ ,ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్న అవకాశాలపై సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ డెవలెప్ మెంట్ ఎజెండాను సదస్సు ముందు ఉంచనున్నారు. ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు కార్యక్రమంపై ముఖ్యమంత్రి సలహదారు శామ్యూల్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు…పరిశ్రమలు, మౌళిక సధుపాయాలు, టూరిజం సామర్ధ్యం, బుద్దిస్ట్ సర్క్యూట్ లపై అధికారులు సదస్సులో వివరించనున్నారు..
ఉన్న పళంగా కాకపోయినా భవిష్యత్లో పెట్టుబడులు..!
సదస్సుకు హాజరవుతున్న దేశాల్లో భారత ఉపఖండానికి చెందిన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు కూడా ఉన్నాయి. ఈ దేశాలతో తీర ప్రాంత రవాణాతో పాటు ఇతర అనుబంధ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపే దేశాలతో మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు సాధించవచ్చని సర్కార్ అంచనా వేస్తోంది.