ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు మూడు నెలల విరామం తరువాత హైదరాబాద్ వెళ్ళడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తన శైలిలో భాష్యం చెప్పారు. ఓటుకి నోటు వ్యవహారానికి ప్రదానసూత్రదారుడు అయిన చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదిర్చారని అన్నారు. కనుక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో మరొక్క రోజు అదనంగా ఉండాలన్నా కూడా దానికి కేసీఆర్ అనుమతి అవసరమని అన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులను జూన్ 2లోగా విజయవాడకు తరలించడం కూడా ఆ షరతులలో భాగమేనని అంబటి అన్నారు. “పదేళ్ళ వరకు హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి భయపడటం చూస్తే ఆ సంగతి అర్ధమవుతోంది. ఓటుకి నోటు కేసులో తనను తెలంగాణా ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తే, తమ ఫోన్లను ట్యాపింగ్ చేసినందుకు ఆ మరునాడే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.