వైకాపా నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. “చంద్రబాబు తను రాష్ట్రంలో నెంబర్: 1 కూలీనని చెప్పుకొంటారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేశామని బాధపడుతుంటారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకని చెపుతూ ప్రత్యేక విమానాలలో విదేశాలలో తిరుగుతూ 7 స్టార్ హోటల్స్ లో బస చేస్తూ చాలా విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. వెంట అనేక సూట్ కేసులు ఎందుకు తీసుకువెతుంటారు. వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. బహుశః రాష్ట్రంలో దోచుకొన్న డబ్బుని విదేశాలలో దాచుకోనేందుకే వెళ్లి వస్తుంటారేమో?”
“చంద్రబాబు చాలాసార్లు విదేశీ పర్యటనలు చేశారు. వాటివల్ల రాష్ట్రానికి ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయి? ఎప్పుడు విదేశాలకి వెళ్ళినా ఎం.ఓ.యు.లు చేసుకోవడమే తప్ప వాటిలో ఏ ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా? జపాన్ తో కూడా ఎం.ఓ.యు.లు చేసుకొన్నారు కానీ ఇంతవరకు ఒక్క పైసా వచ్చిందా? కొత్తగా ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయో చెప్పాలి. విదేశాలలో అడుక్కోవడం వలన పెట్టుబడులు రావు. రాష్ట్రంలో మౌలికవసతులు కల్పిస్తే వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే వస్తాయి.”
“చంద్రబాబు తన విదేశీ మోజుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ యావలో స్వదేశీ పెట్టుబడుదారులు, పారిశ్రామికవేత్తలు ఆయన కళ్ళకి కనబడటమే లేదు. పెట్టుబడుల సాకుతో విదేశాలలో తిరిగే బదులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే, పెట్టుబడులు, పరిశ్రమలు వాటంతట అవే తరలి వస్తాయి,” అని అంబటి రాంబాబు అన్నారు.
అంబటి రాంబాబు విమర్శలలో సూట్ కేసులను పక్కనపెట్టి చూస్తే మిగిలినవన్నీ సహేతుకంగానే కనిపిస్తాయి. ఈ రెండేళ్ళలో చంద్రబాబు నాయుడు తన బృందాన్ని వెంటేసుకొని సింగపూర్, చైనా, జపాన్ తదితర దేశాలు చాలా సార్లు తిరిగి వచ్చారు. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా అదే పని మీద ఓసారి అమెరికా వెళ్లివచ్చారు. కానీ రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. పెట్టుబడులు రాలేదు. అలాగే చాలా అట్టహాసంగా సి.ఐ.ఐ. సదస్సులు కూడా నిర్వహించారు. కానీ ప్రయోజనం లేదు. చివరికి గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఎం.ఓ.యు.లు, వాటికోసం కోట్లు ఖర్చు చేసి ముద్రించిన రంగురంగుల బ్రోచర్లు మాత్రమే మిగిలాయి.
చంద్రబాబుకి విదేశీ మోజు గురించి అంబటి చేసిన విమర్శలను కొట్టిపారేయలేము. ప్రపంచంలో అనేక దేశాలు మన దేశానికి చెందిన ఇంజనీర్లు,సాంకేతిక నిపుణులకి బారీ జీతాలు ఇచ్చి పనులు చేయించుకొంటుంటే, చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం విదేశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రెండేళ్ళ సమయం వృదా చేశారని చెప్పకతప్పదు. అదే..చేతిలో ఉన్న డబ్బుతో చిన్నగా పనులు మొదలుపెట్టి ఉన్నా ఈ పాటికి రాజధానికి కొంత రూపురేఖలు ఏర్పడి ఉండేవి. కేంద్రం కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చేది. స్వదేశీ సంస్థలకి, యువతకి, రాష్ట్రానికి కూడా మేలు కలిగేది. రాష్ట్ర ప్రజలు కూడా హర్షించేవారు. పైగా ఇన్ని విమర్శలు ఎదుర్కోవలసిన అవసరమే ఉండేది కాదప్పుడు.
తాత్కాలిక సచివాలయంపై వందల కోట్లు ఖర్చు చేస్తూ, ప్రత్యేక విమానాలలో విదేశాలలో తిరుగుతూ విలువైన సమయం, ప్రజాధనం రెండూ వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలే కాదు…చాలా మంది ప్రజలు కూడా అనుకొంటున్నారు. అలాగ అన్నవారిపై వైకాపా ముద్ర వేసేసి చేతులు దులుపుకోవచ్చు కానీ ఆవిధంగా చేస్తే చివరికి నష్టపోయేది తెదేపాయే.
నిజానికి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, సమర్ధత, అనుభవాన్ని చూసే అధికారం కట్టబెట్టారు. ఆ సంగతి ఆయనకీ తెలుసు. అదే విషయం పదేపదే చెప్పుకొంటారు కూడా. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే మెరుపువేగంతో అభివృద్ధి పనులు మొదలవుతాయని ప్రజలు అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ అభివృద్ధి అంతా కాగితాలకే పరిమితం అయిపోవడం, రెండేళ్ళయినా ఏ పనులు మొదలవకపోవడంతో రాష్ట్ర ప్రజలు చాలా నిరాశ, అసహనంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఇటువంటి ప్రతీ అంశాన్ని గుర్తుంచుకొనే ప్రజలు ఓట్లు వేస్తారని గ్రహించి, మిగిలిన ఈ మూడేళ్ళలోనైనా ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేస్తే చాలా మంచిది.