ఓ సలహాదారు రాజీనామా చేయగానే మరో సలహాదారును ఏపీ సర్కార్ నియమించింది. రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్లుగా తెలియగానే.. సోషల్ మీడియాలో సెటైర్లు పడినట్లుగా ఆ కేబినెట్ ర్యాంక్ సలహాదారు పదవిని రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా..కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతకే ఇచ్చారు. అయితే.. ఈ సారి రామచంద్రమూర్తికి ఇచ్చిన సుపరిపాలన సలహాదారు పదవి కాకుండా.. వ్యవసాయ కేటగిరిలో సలహాదారును నియమించారు. చాలా కాలంగా వైసీపీ నేతగా.. వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్న అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ కేటాయించారు. జీతభత్యాలను అదే రేంజ్లో నిర్ణయించారు.
అంబటి కృష్ణారెడ్డికి జీతభత్యాలు కలిపి నెలకు మూడున్నర లక్షల వరకూ ముట్టచెబుతారు. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లిస్తారు. అంబటి కృష్ణారెడ్డి ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం మరో మూడు లక్షలు… వంట సామాగ్రి కోసం లక్షన్నర.. ఇస్తారు.
సలహాలిచ్చే పనిలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి.. కృష్ణారెడ్డికి ఓ ప్రైవేట్ సెక్రటరీ , మరో అడిషనల్ పీఏ, బయటి నుంచి మరో పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్స్ , ఒక జామేదార్.. ఒక డ్రైవర్..మరో అదనపు డ్రైవర్‌ను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు ఫోన్ కనెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న 33 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఉంది.