అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి గుంటూరులో టేకోవర్ చేసుకున్న గ్రీన్ గ్రేస్ అనే అపార్టుమెంట్ ఇక శిథిలం కానుంది. అనుమతి లేకుండా అంతస్తుల మీద అంతస్తులు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా.. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల్ని కూడా తీసుకోలేదు. గతంలో తెచ్చుకున్న అనుమతుల్ని పాటించకపోవడంతో ఆ అనుమతుల్ని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆ అపార్టుమెంట్ ఇక శిథిలం కావడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గుంటూరులో జూట్ మిల్లు గురించి తెలియని వారు ఉండరు. కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేది. అయితే అది రాను రాను నష్టాల బారిన పడటంతో ఆ భూమిపైన పెద్దల కన్ను పడింది. గతంలో ఆదిత్య సంస్థ కొంత భూమిని తీసుకుని ఫ్లాట్లు కట్టి అమ్మేసింది. ఆ తర్వాత మరికొంత భూమిలో అదే పని ప్రారంభించింది. చేతులు మారి చివరికి అది అంబటి మురళి చేతికి వచ్చింది. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఈ అపార్టుమెంట్ రైల్వే ఎన్వోసీ కూడా తీసుకోలేదు. పురపాలక అనుమతులు కూడా లేవు. అయినా పద్దెనిమిది అంతస్తుల మేర నిర్మాణం చేశారు. పనులను నిలిపివేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
చాలా వరకూ ఫ్లాట్లు అమ్మేసుకోవడంతో కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరికి అంతర్గతంగా పనులు చేయించి ఫ్లాట్లను హ్యాండోవర్ చేయడం ప్రారంభించారు. ఇలా ఒకరు గృహప్రవేశం కూడా చేయడం వివాదాస్పదమయింది. తీవ్ర దుమారం రేగడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ అపార్టుమెంట్ కు ఎలాంటి పర్యావరణ అనుమతులు కూడా లేకపోవడంతో .. అన్ని రకాల ఉల్లంఘనలతో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం కూడా లేదు.