అంబటి రాంబాబు హఠాత్తుగా వేషం మార్చారు. లాయర్ కోటు వేసిన హైకోర్టులో కనిపించారు. తాను పోలీసులకు సోషల్మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేశానని ఆయినా కేసులు పెట్టలేదని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు తానే లాయర్ కోటు వేసుకుని వాదించడానికి వెళ్లారు. అయితే ఆయన అలా వెళ్లే సరికి.. అంబటి ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నది సమాచారం రావడంతో .. ఆయనకు పెద్దగా పని లేకుండా పోయింది. మళ్లీ కోటు సవరించుకుని బయటకు వచ్చారు. అంబటిరాంబాబు ఎప్పుడు లా డిగ్రీ పూర్తి చేశారో కానీ మొదటి సారి ఆయన ఆ రూపంలో హైకోర్టులో కనిపించడం హాట్ టాపిక్ అయింది.
మామూలుగా అయితే వైసీపీ పెద్ద నేతలు అంబటి, సజ్జల వంటి లీడర్ల న్యాయ అవసరాలు వైసీపీ నెంబర్ వన్ న్యాయకోవీదుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూస్తారు. ఆయనే హైకోర్టుకు వెళ్లి చట్టానికి.. న్యాయానికి జరిగే పోరాటంలో అన్నట్లుగా ఆవేశంగా వాదిస్తూ న్యాయం చేయిస్తూ ఉంటారు. కానీ అంబటి రాంబాబు తన కేసుల విషయంలో పొన్నవోలను ఇన్వాల్వ్ చేయాలని అనుకోలేదు. ఆయన కంటే తానే బెటర్ అని అనుకున్నారేమో కానీ నేరుగా హైకోర్టుకు వెళ్లిపోయారు. వాదించుకున్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుల్ని పెట్టేలా పోలీసుల్ని ఫోర్స్ చేయగలిగారు.
పొన్నవోలు ఇప్పుడు వైసీపీ న్యాయపరమైన అంశాలను చూస్తున్నారు. అంబటిరాంబాబులో ఈ ప్రతిభ ఉందని కూడా గుర్తిస్తే ఇక ఆయన రోల్ వైసీపీలో పెరిగే అవకాశం ఉంది. అంబటి రాంబాబుకు కొత్త బాధ్యతలు న్యాయపరమైన అంశాల్లో వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కానీ.. తెల్లగడ్డం. తెల్లజుట్టు, నల్లకోటుతో అంబటి రాంబాబు స్టైల్ గా ఉన్నారని ఆయన ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.