కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తునిలో బారీ విద్వంసం జరిగిన వెంటనే అది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అతను తన రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక నుండి కాపులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దానికి జగన్ తో సహా వైకాపా నేతలు చాలా మంది ధీటుగా జవాబులు ఇస్తూనే ఉన్నారు. పనిలోపనిగా కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబు కాపులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే కాకుండా, తెదేపాపై ఎదురుదాడి కూడా చేసారు. ఆ విషయం ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఉదృతంగా సాగుతున్న కాపుల ఉద్యమాన్ని చీల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని పక్కనపెట్టి, వేరే కాపు నేతలు కొందరితో ఆయన సమావేశమవడం అదే సూచిస్తోంది. కాపులకు, బీసీలకు మద్య చిచ్చు పెట్టడానికే ఆర్. కృష్ణయ్యను ముందుకు తీసుకువచ్చేరు. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెపుతూనే మళ్ళీ ఈ ఉద్యమంలో పాల్గొన్న 27మంది కాపు నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలి? తుని సంఘటనలకు రాయలసీమ, కడప జిల్లాల నుండి వచ్చిన వైకాపా గూండాలే కారణమని తెదేపా ఆరోపిస్తోంది. కానీ తుళ్ళూరులో పంటలు తగులబెట్టిన తెదేపా గూండాలే తునిలో కూడా విద్వంసం సృష్టించారని మాకు అనుమానాలున్నాయి.” అని అంబటి రాంబాబు ఆరోపించారు.
ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మి నారాయణ, అంబటి రాంబాబు వంటి కొంతమంది నేతలు కాపు గర్జనకు హాజరయిన వారిలో ఎవరూ విద్వంసం సృష్టించలేదని కనుక వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం అక్రమం, అన్యాయం అని ఆరోపిస్తున్నారు. అసలు ఇటువంటి సంఘ విద్రోహక చర్యలకు ప్రజలను ప్రోత్సహించడం, పాల్పడటాన్ని అందరూ ఖండించాలి. దీనికి కారకులు ఎవరయినా సరే వారిని కటినంగా శిక్షించాలని కోరవలసిన రాజకీయ నేతలు, వారిని ఉపేక్షించాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోంది. అందుకోసం వారు చాలా తెలివిగా ఆ విద్వంసం సృష్టించింది తెదేపా గూండాలేనని వాదించడం ఇంకా విస్మయం కలిగిస్తోంది. అంబటి రాంబాబు మాటలలో అది స్పష్టంగా కనబడుతోంది.
ఒకవేళ తెదేపా గూండాలే ఆపని చేసి ఉన్నట్లు నమ్ముతున్నట్లయితే, వైకాపా నేతలు సదరు అనుమానితుల వివరాలను పోలీసులకు తెలియజేసి వారి దర్యాప్తుకు సహకరించకుండా, వారి దర్యాప్తుకు ఆటంకం కలిగేలా, పోలీసులపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అనే సందేహం కలుగుతుంది. ఈ విద్వంసం వెనుక తమ ప్రమేయం లేదని నమ్ముతున్నట్లయితే రాజకీయ నాయకులు ఆ విషయాన్ని పోలీసులకే వదిలిపెడితే బాగుంటుంది. అప్పుడు పోలీసుల దర్యాప్తులో ఆరోజు జరిగిన ఘటనలు ఎవరు బాధ్యులో తేలుతుంది. కానీ పోలీసులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తుంటే వైకాపా నేతలు అన్యాయం, అక్రమం అని వాదిస్తుంటే వారినే అనుమానించవలసి వస్తుంది.