రెడ్ బుక్ పై పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పందించిన కొద్ది రోజులకే అంబటి రాంబాబు కూడా రెడ్ బుక్ విషయాన్ని గుర్తు చేశారు. అదీ వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న నేత విషయంలో రెడ్ బుక్ అమలు చేస్తున్నారంటూ అంబటి వ్యాఖ్యానించడం కామెడీగా మారింది.
వైసీపీని వీడాలని ఫిక్స్ అయిన కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆసుపత్రిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.ఎందుకంటే ఆయన చేరికను టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాంటి నేత విషయంలో అంబటి రాంబాబు రెడ్ బుక్ అమలు అవుతుందని మాట్లాడటం వైసీపీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ మారాలనుకుంటున్న నేత విషయంలో ఈ అనసవర వ్యాఖ్యానాలు ఏంటి అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీపై ఏదో విధంగా బురద జల్లాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు స్పందించినట్లుగా కనిపిస్తోంది. మేనిఫెస్టో అమలును వదిలేసి రెడ్ బుక్ అమలుపై చంద్రబాబు, లోకేష్ ఫోకస్ పెట్టినట్లుగా ఉందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిజంగా ఇదే జరిగితే వైసీపీ నేతలు ఇప్పటికే గగ్గోలు పెట్టేవారు. చాలామంది నేతలు కేసులతో జైలుకు వెళ్ళాల్సి వచ్చేది.
వైసీపీ సర్కార్ తరహాలో మేము ప్రతీకార రాజకీయాలు చేయమని ఇప్పటికే చంద్రబాబు, పవన్ లు తేల్చి చెప్పారు. ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని ..అభివృద్ధిపైనే తమ ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ సంబంధం లేని ఇష్యూను కూటమి సర్కార్ కు అంటకడుతూ రెడ్ బుక్ అమలు అవుతుందంటున్న వైసీపీ నేతల ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో అసలు వైసీపీ నేతల బాధేంటి అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.