ఏపీలో పేదలు, బడుగు బలహీనవర్గాలవారి పిల్లలు ఎలా బాగుపడతారు? తప్పనిసరిగా ఇంగ్లిషు మీడియంలో చదవితేనే బాగుపడతారు. అంతకుమించి మరో మార్గంలేదు. ఇది మనం చెప్పడంలేదండి. వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీలో ఫైర్‌బ్రాండ్ నేత అంబటి రాంబాబు చెప్పాడు. ఎస్…రాష్ట్రంలో ఇంగ్లిషు మీడియంను నిర్భంధంగానే ప్రవేశపెడుతున్నాం. పేదలు, బడుగు బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోవల్సిందే. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిషులో చదువుకోకతప్పదు. వారు బాగుపడాలంటే నిర్భంధ ఇంగ్లిషు మీడియం అవసరమని అంబటి చాలా గట్టిగా చెప్పాడు.
ఈయన ఎందుకు ఇంతగా నొక్కి వక్కాణించాడు. ఇంగ్లిషు మీడియంలో చదవాల్సిందేనని ఎందుకు ఆవేశపడిపోయాడు? విజయవాడలో మూడు రోజుల ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి కదా. పాపం అందులో పాల్గొన్న రచయితలు, విద్యావేత్తలు ప్రాథమిక విద్యలో ఇంగ్లిషు మీడియాన్ని ఆక్షేపించారట…! అన్నప్రాసననాడే ఆవకాయ అన్నం తినిపించినట్లుగా చదువు మొదలుపెట్టగానే ఇంగ్లిషు మీడియం ఎందుకు? అమ్మ భాషలో అంటే మాతృభాషైన తెలుగులో చదువుకుంటే బాగుంటుందని అన్నారు. వాళ్లేదో అకడమిక్‌గా మాట్లాడివుంటారు. దీంతో వారు మాట్లాడింది సీఎం జగన్ విధానానికి, ఆలోచనలకు విరుద్ధంగా ఉందని భావించి అంబటి కోపం తెచ్చుకున్నాడు.
పేదలను బాగుచేయాలని, వారికి పేద్ద ఉద్యోగాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి తాపత్రయపడుతుంటే పానకంలో పుడక మాదిరిగా తెలుగు గోలేంటి అనుకున్నాడు రాంబాబు. తెలుగు మీడియం గురించి మాట్లాడినవారు టీడీపీ నేతలేనని రాంబాబు అనుమానం. అందుకే పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగే నాయకులు తెల్ల కండువాలు వేసుకొని కనిపించారట. అసలు ఇంగ్లిషు మీడియం ముందుగా ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నాడు.
అంటే తెలుగు లేకుండా చేసింది టీడీపీయేనని ఆయన ఉద్దేశం. టీడీపీ సర్కారు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి తెలుగును నాశనం చేయడానికి పూనుకుంటే, తాము ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి పేదలను, బడుగు బలహీనవర్గాలను బాగుచేయడానికి ప్రయత్నిస్తున్నామని అంబటి రాంబాబు మాటలకు అర్థం. అసలు ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. తెలుగులో చదువుకోవాలనేకునే ఛాదస్తుల కోసం, సనాతనుల కోసం, బాగుపడే ఆలోచన లేనివాళ్ల కోసం రెండు కోర్సులున్నాయని, అవి చదువుకోవాలని సలహా ఇచ్చాడు.
ఏం సలహా ఇచ్చాడు? బిఏ తెలుగు, ఎంఎ తెలుగు అనే రెండు కోర్సులున్నాయని, తెలుగంటే ఇష్టమైనవారు అవి చదువుకోవాలని చెప్పాడు. పేదలంతా ఇంగ్లిషులో చదువుకుంటే వెంటనే ఉద్యోగాలు దొరికిపోతాయా? వారి జీవితాలు అమాంతం బాగుపడిపోతాయా? సరే…వారు బాగుపడతారా? పడరా? అనే విషయం అలా ఉంచితే ప్రభుత్వ పాఠశాలల్లో వారు ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న తరువాత వారికి ఇంగ్లిషు సరిగా రాక, తెలుగు అసలే రాక రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతే నిజంగానే వారి జీవితాలు పాడైపోతాయి. ఇలా కాకుండా ప్రభుత్వం చూడగలదా?