అంబటి రాంబాబు ఇక వైసీపీలో నోటి సేవకే పరిమితం కావాలి. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి లేకుండా పోయింది. సత్తెనపల్లికి కొత్త నేతను ఇంచార్జ్ గా నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనే పదవి ఇచ్చి ఆయనను పక్కన పెట్టారు. ఇక ప్రెస్మీట్లు పెట్టి విపక్షంపై విమర్శలు చేయడం తప్ప ఆయనకు నియోజకవర్గ బాధ్యత ఉండదు. అంబటి రాంబాబు ఇక ప్రత్యక్ష రాజకీయాలకు పనికి రారని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఆ మేరకు కొత్త ఇంచార్జ్ కోసం వేట ప్రారంభించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి సత్తెనపల్లి ఇంచార్జ్ కోసం గట్టిగా ప్రయత్నించారు కానీ.. ఇప్పుడే వద్దని అనుకున్నారు.
నర్సరావుపేటకు చెందిన గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అనే వ్యక్తి వద్ద డబ్బులున్నాయని ఖర్చు పెడతారన్న నివేదిక రావడంతో ఆయనను పిలిచి మాట్లాడిన జగన్ .. ఇంచార్జ్ గా ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు. ఈ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఎవరో సత్తెనపల్లిలో 90 శాతం మంది వైసీపీ క్యాడర్ కు తెలియదు. ఆయన నరసరావుపేటలో స్థిరపడ్డారు. అయితే ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో జగన్ ఆయనకే చాన్సిచ్చారు.
ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని అంబటి రాంబాబుకు నేరుగా చెప్పేశారని అంటున్నారు. ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణకు.. పొన్నూరు ఇంచార్జ్ పదవి కొనసాగిస్తామని .. ప్రత్యక్ష రాజకీయాలకు అవసరం లేదని.. పార్టీ కోసం పని చేయాలని అంబటికి సూచించినట్లుగా చెబుతున్నారు. దీనికి అంగీకరించడం మినహా అంబటికి మారో మార్గంలేదు.