వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు తమ కులాన్ని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే..
మొన్నామధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ కాపు కులం పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాపులు తాగుబోతులు అని, మాంసం ఎక్కువ తింటారని, ఆవేశపరులు అని ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ కులానికి చెందిన అందరినీ ఒకే గాటన కట్టేసి కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని వారు సోషల్ మీడియా వేదికగా ఆయన ని విమర్శించారు. బహుశా రానున్న మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం , జగన్ ని మెప్పించడం కోసం , తమ సొంత సామాజిక వర్గాన్ని కించపరచడానికి అంబటి రాంబాబు వెనుకాడడం లేదంటూ సోషల్ మీడియా లో కాపు కులానికి చెందిన వ్యక్తులు అంబటి రాంబాబుని దుయ్యబట్టారు.
అయితే అంబటి రాంబాబు తాజాగా తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ మరొక వీడియో చేశారు. తాను యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తన కులపు సోదరులను బాధించి నట్లు తన దృష్టికి వచ్చిందని ఆ సమయంలో తాను అలా అని ఉండకూడదని ఆ తర్వాత తాను పశ్చాత్తాప పడ్డానని, కాపు సోదరులు అందరికీ తన తరఫునుండి ఈ విషయం పట్ల బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన వీడియోలో వ్యాఖ్యానించారు.
మొత్తానికి అంబటి రాంబాబు వ్యవహారం అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లు తయారైంది.