టాలెంటెడ్ క్రికెటర్ అంబటి రాయుడు.. తన హిట్ వికెట్ల సంఖ్యను పెంచుకుంటూనే పోతున్నారు. ఓ సారి ఆవేశంలో..ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో.. అందరూ.. తమకు నచ్చిన రీతిలో.. ప్రకటనలతో ఫేర్వెల్ ప్రకటించేశారు. మంచి ప్రతిభావంతమైన ఆటగాడని అభినందించారు. నిలకడగా.. కాస్త కంట్రోల్లో ఉంటే.. ఇంటర్నేషనల్గా వెలిగిపోయేవాడని చెప్పుకున్నారు. తర్వాత తాను.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటానని… మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ.. క్రికెట్ ప్రపంచంలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దాంతో… దేశవాళీ క్రికెట్లో.. హైదరాబాద్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడా తన ఆవేశాన్ని వదులుకోలేదు. ఓ దశలో హైదరాబాద్ కెప్టెన్ అవుతాడని అనుకున్నారు.. కానీ ఇప్పుడు.. దాన్ని కూడా.. అర్థం లేని ఆవేశంతో వదులుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న అందరిపై ఏసీబీ కేసులు ఉన్నాయని.. చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో కేటీఆర్ కు.. అంబటి రాయుడు ఫిర్యాదు చేశారు. అజహరుద్దీన్ ప్రస్తుతం హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అజహర్ తో పాటు ఆయన ప్యానల్ మొత్తం.. కేటీఆర్ ఆశీస్సులతోనే విజయం సాధించారు. ఇప్పుడు.. అంబటి రాయుడు.. వారిపై.. కేటీఆర్ కు ఫిర్యాదు చేయడమే అనూహ్యం. నిజానికి.. జట్టు ఎంపికలో.. అంబటి రాయుడు.. జోక్యం చేసుకున్నారని.. ఆయన మాట చెల్లకపోవడంతో.. ఇలా ఆవేశంగా.. హెచ్సీఏ బోర్డు సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్సీఏలో జట్టు ఎంపిక ఎప్పుడూ… ప్రతిభ ఆధారంగా జరగదు. బోర్డు సభ్యుల పలుకుబడి ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక జరుగుతూ ఉంటుంది. ఇది బహిరంగ రహస్యం. గతంలో.. ఇదే అంశంపై.. అంబటి రాయుడు… విబేధించి… వేరే జట్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ… అలానే దూకుడుగా ఉంటూ… హైదరాబాద్ జట్టుకు దూరమవుతున్నారు. అంతర్జాతీయ కెరీర్ ను.. అనాలోచితమైన ఆవేశంతో దూరం చేసుకున్న రాయుడు.. దేశవాళీ క్రెకెట్ లోనూ… అలాగే ముగింపు రాసుకుంటున్నారన్న అభిప్రాయం.. క్రికెట్ వర్గాల్లో ఏర్పడుతోంది.