ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకొంది. ఇదే మ్యాచ్‌లో తెలుగు చిత్రసీమ నుంచి కొంతమంది సెలబ్రెటీలు కనిపించారు. ముఖ్యంగా చిరంజీవి, సుకుమార్ స్టేడియంలో మెరిశారు. వాళ్ల రాక చాలామంది తెలుగు అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. కెమెరాలు కూడా వాళ్లని బాగా ఫోకస్ చేశాయి. అయితే.. కామెంటరీ బాక్సులో కూర్చున్న అంబటి రాయుడు మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్’ అని నోరు జారాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
‘ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అనగానే తెలుగువాళ్లు చాలామంది హాజరవుతారు. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది’ అని సహచర కామెంటేటర్ అంటే… ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్. ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్‌కు వస్తే టీవీలో ఎక్కువసార్లు చూపిస్తారు కదా’ అంటూ రాయుడు జోక్ చేశాడు. చిరంజీవి, సుకుమార్‌లకు పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరం ఏముందో రాయుడికే తెలియాలి. సుకుమార్ దేశం గర్వించదగిన దర్శకుడు. ఆయన కోరుకొంటే ప్రతీ రోజూ టీవీల్లో కనిపించి ఉండొచ్చు. అందుకోసం దుబాయ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తనవైపు తిరగాలంటే ఆయన దుబాయ్ వరకూ వెళ్లాలా? ఏంటో… ఈ రాయుడు. తనకు అసహనం ఎక్కువ. మైదానంలో దాన్ని వీలైనంత వరకూ బయటపెట్టేస్తుంటాడు. ఇప్పుడు కామెంటరీ బాక్సులో కూర్చుని కూడా అదే చేస్తున్నాడా? అనిపిస్తోంది. తెలుగువాడు అయ్యుండి, సాటి తెలుగువాళ్లని ఇలా చీప్ కామెంట్స్‌తో తక్కువ చేయడం సరైనది కాదు. బహుశా.. రాయుడు ఇప్పుడు పబ్లిసిటీ కోరుకొంటున్నాడేమో? ఇలాంటి వ్యాఖ్యలతో అయినా సోషల్ మీడియాలో ఉండాలనుకొంటున్నాడేమమో?