ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న అంబటి రాయుడు రాజకీయాలపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు. ఏ పార్టీలో చేరితే టిక్కెట్ వస్తుందా అని సంప్రదింపులు జరుపుతున్నారు. టాలెంటెడ్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు.. అనుకున్న విధంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్లో వేసిన అనేక తప్పటడుగులు..రిటైర్మెంట్ల ప్రకటనలు.. వివాదాలు ఇలా అనేక మజిలీల తర్వాత ఇప్పుడు ఆయన చూపు పొలిటికల్ కెరీర్ వైపు పడింది.
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీలు అంబటి రాయుడు పార్టీలో చేరుతానంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాయి. కానీ పోటీ చేయడానికి టిక్కెట్ కేటాయించడం మాత్రం కష్టమని చెబుతున్నారు క్రికెటర్ ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటారు కానీ.. అలా ఓట్లు పడతాయని మాత్రం అనుకోరు అయితే బీఆర్ఎస్ నుంచి అంబటిరాయుడు ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్.. బీఆర్ఎస్లో చేరి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే అంబటి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
అంబటి రాయుడు దూకుడైన మనస్థత్వం ఉన్న వ్యక్తి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మారుస్తారు. క్రికెటర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలే కెరీర్ ను డ్యామేజ్ చేశాయి. బీసీసీఐకి పోటీగా పెట్టిన లీగ్ లో చేరి.. చాలా కాలం సమయం వృధా చేసుకున్నారు. తర్వాత మళ్లీ బీసీసీఐ పరిధిలోకి వచ్చినా అనవసర ఆగ్రహాలతో చాలా సార్లు అవకాశాలు కోల్పోయారు. ఓ సారి రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. కానీ మళ్లీ ఆటలోకి వచ్చారు. అలా అనేక పరిణామాలతో ఆయన తీరు కాస్త వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో ఇలా ఉంటే… ఏ పార్టీలోనూ నిలకడగా ఉండలేరని.. క్రికెటర్ గా కంటే వేగంగా పొలిటికల్ కెరీర్ ముగిసిపోతుందని అంచనా వేస్తున్నారు.