గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరి గుంటూరు జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన గ్రామాల పర్యటనను వైసీపీ తెర వెనుక కోఆర్డినేట్ చేస్తోంది. ఐ ప్యాక్ ప్లాన్ చేస్తోంది. కానీ.. గ్రామాల్లోని రైతులతోనే మాట్లాడించాల్సి వస్తూండటంతో వారంతా తమ సమస్యకు ఎకరవు పెడుతున్నారు.
తాజాగా ఆయన తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో పర్యటించారు. అక్కడ రైతుల్ని మీ సమస్యలు ఏమిటి అని అడగ్గానే అన్నీ చెప్పారు.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ధాన్యం కొనుగోలు సమస్యలు , సీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల నీటి కాలుష్యం , గ్రామంలో రోడ్లు దుస్థితి, గ్రామానికి ఆదాయం ఇచ్చే క్వారీ కబ్జా , బీసీ కులవృత్తులు చేసుకునేవారికి పని ముట్లు ఇలా లెక్కలేనన్ని సమస్యలు చెప్పారు. అన్నీ సమస్యలే అన్నట్లుగా వారు చెప్పారు. ఇది అంబటికి కొత్తగా అనిపించి ఉండవచ్చు కానీ.. ఆయన ఆ కంప్లైంట్లను విని ఫక్తు రాజకీయ నాయకుడిలాగా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.
కానీ మీడియాతో మాత్రం.. అసలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వపరంగా తమకు మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెప్తున్నారని.. స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయని.. ప్రజలంతా చీకూ చింతా లేకుండా ఉన్నారని చెప్పుకొచ్చారు. అసలు ప్రజలు ఆయనకు చెప్పుకున్న సమస్యలకు … రాయుడు మీడియాతో చెప్పిన అంశాలకు అసలు పొంతన లేదు.
రాయుడుకు నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఐ ప్యాక్ టూర్లు కాకుండా సొంతంగా గ్రామాల్లో పర్యటించి.. మాట్లాడితే.. క్లారిటీ వస్తుందని.. లేకపోతే..క్రికెట్ కెరీర్ లో ఐసీఎల్ లోకి వెళ్లినట్లుగా అవుతుందన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.