వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లిట్మస్ టెస్టు ఎదురుగా వచ్చింది. అంబటి రాంబాబు లేదా పొన్నవోలు సుధాకర్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే ఇది ఏదైనా పదవి కోసమో.. పార్టీ అభ్యర్థిత్వం కోసమో కాదు …జైలుకెళ్తున్న తమ పార్టీ నేతల కోసం కోర్టుల్లో వాదించే లాయర్ పోస్టు కోసం.
లాయర్‌గా సక్సెస్ అవుతున్న అంబటి రాంబాబు
అంబటి రాంబాబు ఇటీవల లాయర్ గా మారారు. మంచి ట్రాక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. తాను పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా కేసులు పెట్టలేదని ఆయన కోర్టులో పిటిషన్లు వేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నమ్మకుండా ఆయన స్వయంగా నల్లకోటు వేసుకుని వెళ్లి హైకోర్టులో వాదించుకున్నారు. ఆయన వాదనలు విని భయపడ్డారేమో కానీ.. పోలీసులు కోర్టు ఆదేశాలు ఇవ్సక ముందే కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేశామనే విషయాన్ని కోర్టుకు చెప్పారు. దాంతో అంబటి వాదనలకు రాజకీయాల్లోనే కాదు..కోర్టుల్లోనూ బలం ఉందని స్పష్టత వచ్చింది.
వరుసగా విఫలవుతున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ కు అత్యంత ఇష్టమైన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన సామర్థ్యంపై అపారమైన నమ్మకం ఉంది. అయితే తన కోసం కానీ.. సజ్జల రామకృష్ణారెడ్డి లేదా కోటరీలోని వ్యక్తుల కోసం పొన్నవోలును ఎప్పుడూ వాదనకు పిలిపించుకోరు. నిరంజన్ రెడ్డికే అవకాశం కల్పిస్తారు. ఇతర నేతలకు మాత్రం పొన్నవోలును పంపుతారు. ఆయన అసలు సక్సెస్ కావడం లేదు. ఆయన వాదనలు వింటే ఈయన లాయర్ ఎలా అయ్యాడని ఎవరికైనా డౌట్ వస్తుంది. చివరికి గోరంట్ల విషయంలో కూడా ఆయనను అరెస్టు చేయాలంటే లోక్ సభ స్పీకర్ అనుమతి కావాలని వాదించారు. దీంతో అందరూ పొన్నవోలుపై విచిత్రంగా చూశారు. ఆయన మాజీ ఎంపీ అని కూడా పొన్నవోలు తెలియగానే అనుకున్నారు. ఇలాంటి ఆణిముత్యాలతో అందర్నీ ఆయన జైలుకు పంపుతున్నారు.
వైసీపీ న్యాయవిభాగానికి అంబటి చీఫ్ అయితే బెటర్ !
గోరంట్ల మాధవ్ ను జైలుకు తరలిస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులతో వాదనకు దిగారు. ఆ సమయంలో ఆయన సెక్షన్ల గురించి కూడా చెప్పారు. అంబటి వాదనా పటిమను బయట పోలీసులతో చూపిస్తే ప్రయోజనం ఏముంటుందని కోర్టు హాల్లో చూపించాలని క్యాడర్ కోరుకుంటున్నారు. పొన్నవోలుకు రిటైర్మెంట్ ప్రకటించి.. అంబటికి న్యాయవిభాగం బాధ్యతలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కావాలంటే అంబిటికి అసిస్టెంట్‌గా పొన్నవోలును పెడితే పర్ఫెక్ట్ కాంబినేషన్ కావొచ్చని అంటున్నారు.