వచ్చే ఎన్నికలలో అభ్యర్ధులెవరూ ఖర్చు చేయనవసరం లేదు. అందరికి పార్టీయే ఖర్చు చేస్తుందని’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తన పార్టీ ప్రజా ప్రతినిధులతో చెప్పడంపై, అనేకమంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
దీనిపై వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందన ఏవిధంగా ఉందంటే: “వచ్చే ఎన్నికలలో ఒక్కో నోయోజక వర్గానికి 5 నుంచి 20 కోట్లు వరకు పార్టీ తరపున ఖర్చు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే రాష్ట్రంలో గల 175 నియోజక వర్గాలకు ఒక్కో దానికి రూ.5 కోట్లే ఖర్చు చేయాలన్నా కనీసం రూ. 875 కోట్లు కావలసి ఉంటుంది. అదే 20 కోట్ల చొప్పునయితే రూ. 3500 కోట్లు కావలసి ఉంటుంది. మరి అంత డబ్బు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ నుంచి తెస్తారనే అనుమానం కలగడం సహజం. బహుశః ఈ ఐదేళ్ళలో అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుని అందుకు వినియోగిస్తారేమో? ఇప్పుడే ఆయన కొడుకు నారా లోకేష్ మా పార్టీ ఎమ్మెల్యేలకు విచ్చల విడిగా డబ్బులు పంచి పెడుతుంటే, ఆయన పార్టీలో చేరితున్న వైకాపా ఎమ్మెల్యేలకి పచ్చ కండువాలు కప్పుతున్నారు. ఇదంతా అవినీతితో సంపాదించిన డబ్బు కాదా?” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడిపై తన విమర్శలను కొనసాగిస్తూ “అధికారంలోకి రావడం కోసం నోటికొచ్చినట్లు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలుచేయకుండా మళ్ళీ ప్రజలను మోసగిస్తున్నారు. ఆ కారణంగా తన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించి మా పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశ్యంతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడుకొనేందుకు శాసనసభను, స్పీకర్ అధికారాలను కూడా దుర్వినియోగం చేసారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అయితే మా పార్టీలో నుంచి వచ్చిన చేరిన కొందరు తన వెంట ఉంటే, తనే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండిపోవచ్చునని చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారు. కానీ ఆయన చేస్తున్న ఈ అవినీతి, అప్రజాస్వామిక పనులని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారనే సంగతి ఆయన పట్టించుకొంటున్నట్లు లేదు. తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలే ఆయనకి తగిన గుణపాఠం చెపుతారు,” అని అంబటి రాంబాబు అన్నారు.