అమరావతి మాస్టర్ ప్లాన్‌లో గత ప్రభుత్వం దాదాపు వంద ఎకరాల్లో నిర్మించాలనుకున్న అంబేద్కర్ స్మృతి వనం పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు.. విజయవాడ స్వరాజ్ మైదానంలో కట్టాలని నిర్ణయించుకుంది. స్వరాజ్ మైదానం దాదాపుగా 20 ఏకరాలు ఉంటుంది. ఇందులోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు మెమోరియల్ పార్క్‌ను నిర్మిస్తారు. ప్రస్తుతం.. ఈ భూమి న్యాయవివాదాల్లో ఉంది. అదే సమయంలో ఇరిగేషన్ శాఖకు ఆధ్వర్యంలో ఉంది. న్యాయవివాదాల సంగతేమో కానీ.. ఇరిగేషన్ శాఖ నుంచి భూమిని.. సాంఘిక సంక్షేమ శాఖకు మార్పించారు. బుధవారం శంకుస్థాపన చేసి ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు
గత ప్రభుత్వం అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటి అయిన ఐనవోలులో.. వంద ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేసింది. వంద కోట్లు కేటాయించింది. మిగిలిన అమరావతి పనుల్లాగే.. అది కూడా.. ఇరవై శాతం లోపు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అమరావతి పనుల్లాగే.. ఆ స్మృతి వనం పనులను నిలిపివేసిన ప్రభుత్వం… దళిత వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా.. స్వరాజ్ మైదానంలో నిర్మించాలని నిర్ణయించింది. అయితే..ఇదంతా రాజకీయమేనని.. కోర్టు వివాదాల్లో ఉన్న స్వరాజ్ మైదానంలో ఎలా విగ్రహాన్ని నిర్మిస్తారని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలానికి చెందిన వివాదాలను ఈ ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
బందరు రోడ్లో ఉన్న స్వరాజ్ మైదానం… అత్యంత విలువైనది. అక్కడ వివిధ రకాల ఎగ్జిబిషన్లు.. మార్కెట్లు… ఇతర ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిధుల సేకరణలో భాగంగా బిల్డ్ ఏపీ అంటూ.. కొన్ని ఆస్తులను అమ్మాలనుకున్న ఏపీ సర్కార్.. మొదట్లో ఈ భూమిని కూడా.. జాబితాలో చేర్చింది. తర్వాత న్యాయవివాదాలు లేదా.. ప్రజాగ్రహం వస్తుందని భావించారేమో కానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ స్థలంలో.. అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తున్నారు.