పశ్చిమ గోదావరికి చెందిన తెలుగుదేశం నేత అంబికా కృష్ణ భాజపా కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్ననే, ఢిల్లీ వెళ్లి… భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన భాజపాలో ఎందుకు చేరారంటే… మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందనీ, ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే చేరానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకి ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతుందనీ, చాలామంది మిత్రులు ఇప్పుడు భాజపాలోకి వస్తామని తనకి ఫోన్లు చేస్తున్నారనీ, వారందరినీ ఆహ్వానిస్తున్నానని అంబికా కృష్ణ చెప్పారు. ఆ తరువాత, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై విశ్లేషణ చేశారు!
ఎన్నికల సమయంలో తెలుగుదేశం నాయకులు అత్యంత నిబద్ధతతో పనిచేశారన్నారు! కానీ, అధినేత చంద్రబాబు నాయుడు తీరు వల్లనే పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్నారు. నరేంద్ర మోడీతో వైరం పెట్టుకోవద్దని చాలాసార్లు తాము చంద్రబాబుకి చెప్పామనీ, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. మన వ్యవహారాలేవో మనం చూసుకుందామని చెప్పినా ఆయన వినలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకంగా పోరాడటం వల్లనే టీడీపీకి ఈ గతి పట్టిందని విశ్లేషించారు. చంద్రబాబు తీరు చాలామందికి నచ్చలేదన్నారు!
పార్టీ మారగానే టీడీపీ ఓటమి మీద విశ్లేషణ చేసేస్తున్నారు..! ఇదే విశ్లేషణ పార్టీ ఉండి చేస్తే కొంతైనా అర్థవంతంగా ఉండేదేమో కదా! కేంద్రంలో అధికార పార్టీ అండ కోసం అర్రులు చాచుతున్నవారంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వెళ్తున్నవారే ఎక్కువ. అది స్పష్టంగానే ప్రజలకు అర్థమౌతోంది. ఇంకోటి… ఎన్నికల సమయంలో నాయకులంతా నిబద్ధతతో వ్యవహరించారని అంబికా కృష్ణ అంటున్నారు. సరే, ఆ నిబద్ధతే ఉంటే, ఇప్పుడు పార్టీని వదిలేసి భాజపావైపు ఎందుకు వెళ్తున్నట్టు అనే ప్రశ్న వస్తుంది కదా! పార్టీ అధికారంలో ఉంటేనేనా నాయకులకు నిబద్ధత, పార్టీ మారిపోతున్నప్పుడు నిబద్ధత ప్రస్థావన రాదా? ఇంకోటి… కేంద్రంతో గొడవ వద్దంటే చంద్రబాబు నాడు వినలేదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకే కేంద్రంతో పోరాటం అని నాడు టీడీపీ నిర్ణయించింది. అంటే, ఆ పోరాటమే తప్పు అని ఇప్పుడు అంబికా విశ్లేషిస్తున్నట్టా..? మొత్తానికి, టీడీపీ ఓటమి అధినాయకుడు ఒక్కరిదే బాధ్యత అన్నమాట. నాయకులకు నిబద్ధత ఉంది కాబట్టి, అధికారం ఉన్నచోటికి వెళ్లిపోతున్నారన్నారమాట!