అమెరికాలోని భారతీయుల లైఫ్ స్టైల్ నేపథ్యంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో చూపించినట్టు అమెరికాకు వెళ్ళిన మన భారతీయులు అలాగే ఉంటారా? అంటే చెప్పడం కష్టం. దర్శకులుగా మారిన ఎన్నారైలు శేఖర్ కమ్ముల తీసిన ‘డాలర్ డ్రీమ్స్’, దేవా కట్ట తీసిన ‘వెన్నెల’ సినిమాలు అమెరికాలోని ఇండియన్ లైఫ్ స్టైల్ గురించి చక్కగా, సహజత్వానికి దగ్గరగా చూపించారని పేరొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికా నేపథ్యంలో ‘ఎ2ఎ’ (అమీర్‌పేట 2 అమెరికా) టైటిల్‌తో తెలుగులో ఒక సినిమా వస్తుంది. కథేంటో ట్రైలర్లో చాలా క్లారిటీగా చెప్పారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొందరు కుర్రాళ్ళు, అక్కడి సంపాదన, పాశ్చాత్య సంస్కృతి మోజులో భారతీయ విలువల్ని వదిలేయడం, లవ్, బ్రేకప్, భారతీయ విలువ బోధన… మిక్సీలో చాలాసార్లు రుబ్బేసిన కథను మళ్ళీ చెప్పాలని ప్రయత్నించారు. ఎక్కువగా కొత్తవాళ్ళు నటించిన ఈ సినిమాలో కామెడీపై యూట్యూబ్ స్టార్ ‘వైవా’ హర్ష తదితరులపై ఆధారపడ్డారు. ఎన్నారై పవర్ గురించి ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ కాస్తో కూస్తో ఆసక్తి కలిగించేలా వుంది. టేకింగ్, మేకింగ్, క్యాస్టింగ్ పరంగా ఆకట్టుకొని ఈ ట్రైలర్ థియేటర్ల వరకూ ఎంతమంది ప్రేక్షకులను తీసుకొస్తుందో చూడాలి.