పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆత్మీయ సన్మాన సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఫిరాయింపుల చట్టసవరణ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అది చేయగలిగితే, ఇకపై ప్రజాప్రతినిధులు పార్టీ మారిన వెంటనే తమ పదవిని కోల్పోయేవిధంగా అందులో నిబంధనలు ఉంటాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజల ఆలోచనలకి అనుగుణంగా పనిచేయడం అలవరుచుకోవాలని చెప్పారు. ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్ధుల ఆర్ధికశక్తే ప్రధాన అర్హత కావడాన్ని ఆయన నిరసించారు.
రాజకీయాలలో ఉన్నవారందరూ విలువల గురించి మాట్లాడుతూనే ఉంటారు కానీ వారిలో ఏ కొద్ది మందో వాటిని ఆచరిస్తుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థని దెబ్బ తీసి నిరంకుశపాలనకి అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపులని భాజపాతో సహా అన్ని రాజకీయపార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. కనుక ఫిరాయింపుల నిరోధ చట్టానికి సవరణలు చేయడం అంత సులువు కాదు. అనేక విప్లవాత్మక సంస్కరణలను చాలా ధైర్యంగా అమలుచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకొంటే అది అసాధ్యం కూడా కాదు.
ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆ పని చేయగలిగితే, రాజకీయ పార్టీల, నేతల ఆలోచనావిధానంలో, రాజకీయాలలో పెను మార్పులు వస్తాయి. పార్టీ మారితే పదవులు పోతాయని తెలిస్తే, ఎవరూ అటువంటి ఆలోచన కూడా చేయరు. అప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటిలో స్థిరత్వం ఏర్పడుతుంది. దానివలన అధికార పార్టీలలో నిరంకుశ పోకడలు మాయం అవుతాయి.
గతంలో యూపియే ప్రభుత్వం హయంలో దాని కోసం కొంత ప్రయత్నం జరిగింది కానీ ఆ చట్టసవరణ నాలుక గీసుకొనేందుకు కూడా పనికిరాదని రాహుల్ గాంధీ చెప్పడంతో అది చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. కనుక మోడీ ప్రభుత్వం లోపరహితంగా చట్టసవరణ చేయగలిగితేనే దాని ప్రయోజనం నెరవేరుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ఎన్నికలకి, డబ్బుకి విడదీయలేనంతగా బందం ఏర్పడిపోయింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారు రూ.500 కోట్ల కరెన్సీ కట్టలు తీసుకువెళుతున్న రెండు వ్యానులు పట్టుబడటం, మళ్ళీ ఆ మర్నాడే అవి హటాత్తుగా మాయం అవడం చూస్తే, ఎన్నికలలో ధనప్రభావం ఎంతగా ఉందో అర్ధం అవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికలలో గెలవడం కోసం ప్రజలకి టీవీలు, ఏసిలు, మోటార్ సైకిల్స్ వగైరా పంచిపెడితే, నరేంద్ర మోడీ రాష్ట్రాలకి వేలు, లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తుంటారు.
ఈ ప్రలోభాలని కూడా అరికట్టడం చాలా అవసరం కానీ, వాటిని స్వయంగా ప్రధానే అమలుచేస్తున్నప్పుడు అరికట్టడం సాధ్యమేనా? అంటే కాదనే చెప్పుకోవలసి ఉంటుంది. చివరిగా రాజకీయ పార్టీలు, వాటి నేతలు అందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే వెంకయ్య నాయుడు చెప్పినట్లుగా ప్రజల ఆలోచనలకి అనుగుణంగా రాజకీయాలు చేయాలని! అప్పుడే వ్యవస్థలో మంచి మార్పులు కనబడటం మొదలవుతుంది.