అమెరికా అంటే అగ్రరాజ్యం. ప్రపంచ పోలీస్. పెద్దన్న. ఎవరైనా దానికి భయపడాల్సిందే. అలాంటి అమెరికా భారత్ ను చూసి భయపడుతోంది. అంతరిక్ష రంగంలో భారత్ విజయాలతో బెంబేలెత్తిపోతోంది. ఇస్రో సత్తాకు అమెరికన్ ప్రయివేట్ స్పేస్ కంపెనీలు బిత్తరపోతున్నాయి. భవిష్యత్తులో తమ పని ఖాళీ అని టెన్షన్ పడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నాయి.
ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేసన్. ఆకాశమే హద్దుగా కాదు, అంతకు మించిన విజయాలతో దూసుకుపోతున్న సంస్థ. అంతరిక్ష ప్రయోగాల్లోప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా విజయాలను సాధిస్తున్న సంస్థ. ఒకప్పుడు అమెరికా, రష్యా అంతరిక్ష కేంద్రాల నుంచి ఉపగ్రహాలను భారత్ ప్రయోగించేది. ఇప్పుడు అమెరికా సహా ఏదేశం ఉపగ్రహాన్నయినా తక్కువ ఖర్చుతో ప్రయోగించేస్థాయికి ఎదిగింది. అంతరిక్ష ప్రయోగాల్లో సెంచరీ క్రాస్ చేసింది.
అమెరికా ఊహించనంత తక్కువ ఖర్చుతో ఉప్రగహ ప్రయోగం చేసిపెట్టడం ఇస్రో ప్రత్యేకత. అందుకే, యూఎస్ సర్కార్ సైతం ఇస్రోకే జైకొడుతోంది. అమెరికాలోని ప్రయివేట్ స్పేస్ కంపెనీలకు ఇది కంటగింపుగా మారింది. బడా కార్పొరేట్ కంపెనీలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఇస్రో దూకుడుకుఅడ్డుకట్ట వేయాలని అక్కడి చట్ట సభల సభ్యులు కోరాయి. ఇస్రో ద్వారా అమెరికా ఉప్రగహ ప్రయోగాలు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆ కార్పొరేట్ సంస్థల అధిపతులు లబోదిబో మంటున్నారట.
భారతీయ సంస్థ ఇస్రో స్థాయిలో తక్కువ ఖర్చుతో సేవలు అందించడం వాళ్లకు సాధ్యం కాదట. అయినా సరే ఇస్రో సేవలను అమెరికా పొందకూడదట. ఖర్చు ఎక్కవైనా తమ సేవలనే పొందాలట. అసంబద్ధమైన ఈ డిమాండును విని కొందరు అమెరికా చట్ట సభల సభ్యులు విస్తుపోయారట. అయినాసరే, అమెరికాలో బడా కార్పొరేట్ సామ్రాజ్యాల మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రోదసీ రంగంలో ఇస్రో ఆధిపత్యానికి చెక్ పెట్టాలని కార్పొరేట్ పెద్దలు గట్టిగా నిర్ణయించారట.
1969లో ప్రారంభమైన ఇస్రో, బెంగళూరు కేంద్రంగా పనిచేసే పవర్ ఫుల్ సంస్థ. రాకెట్ ప్రయోగాల్లో ఎవరూ సాటిలేరనే స్థాయిలో విజయాలను సాధిస్తోంది. నాలుగేళ్ల క్రితమే వందో అంతరిక్ష ప్రయోగాన్ని పూర్తి చేసింది. అభివృద్ధి చెందినబడా దేశాల ఉపగ్రహాలను కూడా చౌకగా, విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఇస్రో అంటే ఓ గ్యారంటీ. ఓ భరోసా. అందుకే అమెరికా కూడా జయహో ఇస్రో అంటోంది. అక్కడి కార్పొరేట్ స్పేస్ కంపెనీ దిగ్గజాలు మాత్రం టెన్షన్ పడుతున్నారు. అంటే ఇస్రో ప్రభావం ఇంత ఘాటుగా ఉందన్న మాట.