ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే కొన్ని భవనాలను అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ తో, మరికొన్నిటిని స్వదేశీ ఆర్కిటెక్ట్ తో డిజైన్ గీయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. డెన్మార్క్ దేశానికి చెందిన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ రెమ్ కూల్హాస్ పోటీ నుండి తప్పుకొన్నాక ఆయన స్థానంలో అమెరికాకు చెందిన ఫ్రాంక్ గెయిరీ అనే ఆర్కిటెక్ట్ తో గీయిస్తున్నారు. ఆయన అసెంబ్లీ మరియు హైకోర్టు భవన సముదాయాలకు డిజైన్ ఇస్తారు. ఇక రాజ్ భవన్, సచివాలయానికి స్వదేశానికే చెందిన ఆర్కిటెక్ట్ చేత డిజైన్ గీయిస్తారు. అన్ని భవన సముదాయాలు కూడా పూర్తిగా మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా ఉంటూనే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నెల నుండి అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా అందుకు అవసరమయిన ఏర్పాట్లు, నిధులు, అనుమతులు అన్నీ సిద్దం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.