Amigos Movie Telugu Review
రేటింగ్: 2.75/5
కళ్యాణ్ రామ్ కథల ఎంపిక కొత్తగా వుంటుంది. అలాగే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు. బింబిసార విజయం కొత్త దర్శకుడిపై ఆయన పెట్టిన నమ్మకంతో వచ్చిందే. ఇప్పుడు ఆరో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డితో అమిగోస్ చేశారు కళ్యాణ్ రామ్. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడం, కళ్యాణ్ రామ్ త్రిపాత్రభినయం చేయడం, ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించడంతో అందరి ద్రుష్టి పడింది. అలాగే ‘డోపెల్గాంగర్’ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ ని కూడా ప్రమోషనల్ మెటిరియాల్ మిక్స్ చేసి క్యురియాసిటీని పెంచారు. మరి ప్రమోషన్స్ లో కనిపించిన ఆసక్తిని సినిమాలో కొనసాగిందా ? అసలు ‘డోపెల్గాంగర్’ అంటే ఏమిటి ? కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం ఎలాంటి థ్రిల్ ని ఇచ్చింది ?
సిద్దార్థ్ (కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో తన తండ్రి బిజినెస్ ని చూస్తుంటాడు. తొలి చూపులోనే ఇషికా (ఆషికా రంగనాథ్) ని ఇష్టపడతాడు. అయితే ఇషికా మాత్రం పెళ్లి చేసుకోవాలంటే తను పెట్టె పరీక్షలో నెగ్గాలని కండీషన్ పెడుతుంది. ఇదే సమయంలో సిద్దార్థ్ కు మీట్ డోపెల్గాంగర్ అనే వెబ్ సైట్ ద్వారా అచ్చు తన పోలికలతో వున్న మంజునాథ్, మైఖేల్ పరిచయం అవుతారు. వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. మంజు, మైఖేల్ సాయంతో ఇషికా ప్రేమని కూడా గెలుచుకుంటాడు సిద్దార్థ్. అయితే మైఖేల్ రూపంలో సిద్దార్థ్ కు ఊహించని ఓ పెను ప్రమాదం వచ్చిపడుతుంది. మైఖేల్ గురించి ఓ నిజం తెలుసుకుంటాడు సిద్దార్థ్. మైఖేల్ అసలు పేరు బిపిన్ రాయ్. అతని కోసం ఎన్ఐఎ అధికారులు వెదుకుతుంటారు. ఇంతకీ మైఖేల్ ఎవరు ? పేరు మార్చుకొని సిద్దార్థ్ , మంజుకు ఎందుకు పరిచయం అవుతాడు ? అతని వలన సిద్దార్థ్ మంజు ఎలాంటి సవాల్ లని ఎదురుకున్నారు ? అనేది మిగతా కథ.
ఒకే పోలికల వున్న పాత్రల మధ్య జరిగే కథ ఇది.’ రాముడు భీముడు’ దగ్గర నుంచి ఇలాంటి కథలు, పాత్రల వచ్చాయి. అయితే కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి డోపెల్గాంగర్ అనే కాన్సెప్ట్ తో ఈ కథని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు. సిద్దార్థ్, ఆషికా ల ప్రేమ కథ థ్రిల్ కి కాస్త అడ్డు తగిలినా.. ఎప్పుడైతే సిద్ధు, మంజు, మైఖేల్ కలిశారో.. కథ వేగం పుంజుకుంటుంది. మైఖేల్ పాత్ర నెగిటివ్ అని అతని పాత్రని తీర్చిద్దిన విధానం చూస్తే తెలిసిపోతుంది. ఎన్ ఐఎ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో ఈ కథ ఎలా వుంటుందో ఊహకు అందుతుంది. అయినప్పటికీ కొన్ని థ్రిల్ మూమెంట్స్ తో ఎంటర్వెల్ బాంగ్ వేయడం సెకెండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.
విరామం తర్వాత వచ్చే మైఖేల్ ఫ్లాష్ బ్యాక్ కూడా పవర్ ఫుల్ గా వుంటుంది. అయితే అంత పవర్ ఫుల్ మైఖేల్ పాత్రకు సెకండ్ హాఫ్ లో ఎన్ఐఎ, సిద్దార్థ్ నుంచి బలమైన సవాళ్ళు ఎదురయ్యే విధంగా ఎత్తుకు పై ఎత్తుగా డిజైన్ చేసినట్లయితే అమిగోస్ మరింత థ్రిల్ గా వుండేది. నిజానికి ఇలాంటి కథలు ప్రజంట్ చేసినప్పుడు ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశాలు వుంటాయి. అయితే కొత్త దర్శకుడు చాలా క్లారిటీతో ఎక్కడా కన్ ఫ్యూజ్ లేకుండా నీట్ గా ప్రజంట్ చేశాడు. ఒక కొత్త బ్యాగ్డ్రాప్ లో కథని బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్ చెప్పడంలో దర్శకుడు చాలా వరకూ పై చేయి సాధించాడు.
కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో చక్కని అభినయం కనబరిచాడు. మూడు పాత్రలకు స్పష్టమైన వేరియేషన్స్ చూపించాడు. బిపిన్ పాత్ర అమిగోస్ కి ప్రధాన ఆకర్షణ. మిగతా రెండు పాత్రల్లో తన యీజ్ చూపించాడు. యాక్షన్ సీన్స్ గ్రేస్ ఫుల్ గా చేశాడు. అషికా అందంగా వుంది. అయితే ఆమెకు కథలో అంత ప్రాధాన్యత లేదు. బ్రహ్మజీ పాత్ర నవ్వించలేకపోయింది.సప్తగిరి గెస్ట్ రోల్ లో కనిపించాడు. తండ్రి పాత్రలో చేసిన జయ ప్రకాష్ తో సహా మిగతా నటీనటులు అందరూ పరిధి మేర నటించారు.
జిబ్రాన్ నేపధ్య సంగీతం ఓకే కానీ పాటలు గుర్తుండవు. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రీమిక్స్ మాత్రం ఆ పాటని అభిమానించేవారికీ ఒక ట్రీట్ లా వుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ఫ్ గా వుండాల్సింది, కెమారపనితనం బావుంది. ప్రతి ఫ్రేం రిచ్ గా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఒకే పోలికలతో వున్న ముగ్గురి మధ్య జరిగిన ఈ కథని ఎలాంటి తికమకకు తావు లేకుండా.. కొత్త నేపధ్యంలో ఒక థ్రిల్లర్ ని యంగేజింగా ప్రజంట్ చేయగలిగాడు దర్శకుడు.
రేటింగ్: 2.75/5