మంచి ఆలోచనాత్మకమయిన, దేశభక్తిని ప్రేరేపించే సినిమాలు తీసే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
‘గత ఏడెనిమిది నెలలుగా దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఒకానొక సమయంలో నా భార్య కిరణ్ “మన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఇటువంటి చోట మన పిల్లలు సురక్షితంగా ఉండగలరా? మనం ఈ దేశం విడిచిపెట్టి వేరే ఏదయినా దేశానికి వెళ్లిపోదామా?” అని అడిగింది. నేను నా భార్య మా జీవితం అంతా ఇక్కడే జీవించాము. కానీ చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలను చూసిన తరువాత జీవితంలో మొట్ట మొదటిసారిగా ఆమె నన్ను ఆవిధంగా అడగడం నాకు చాలా ఆందోళన కలిగించింది,” అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారు నిర్వహించిన ఒక సభలో అన్నారు.
ఆయన అన్న ఈ మాటలపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ లో ఆయన సహనటులు, దర్శకులు కూడా ఆయన మాటలను తప్పు పడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపం ఖేర్ స్పందిస్తూ, “మరి అటువంటప్పుడు అమీర్ ఖాన్ ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడం గురించి ఇంతకు ముందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?” అని ప్రశ్నించారు.
“అమీర్ ఖాన్ ఈరోజు తను ఉన్న ఈ గొప్ప స్థితికి కారణం ఈ దేశమే..ఈ దేశంలో ప్రజలు ఆయన పట్ల చూపుతున్న అభిమానమే..ఆ సంగతి విస్మరించి ఈ దేశంలో ఉండటానికి చాలా భయం వేస్తోంది దేశం విడిచి వెళ్లిపోవాలా వద్దా? అని మాట్లాడుతుండటం నాకు చాలా బాధ కలిగించింది,” అని ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ కూడా చాలా ఘాటుగా స్పందించారు. “సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ ముగ్గురు ముస్లిం హీరోలు దేశంలో సూపర్ స్టార్లుగా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఒకవేళ దేశంలో నిజంగా మత అసహనం ఉన్నట్లయితే వాళ్ళు ముగ్గురూ అంత ఉన్నత స్థాయికి చేరగలిగేవారా? దేశంలో అసలు మత అసహనం ఎక్కడ ఉందో నాకు కనబడటం లేదు. కానీ ఈ మత అసహనం గురించి ఏదేదో మాట్లాడేస్తున్నవాళ్ళు అందరూ ప్రముఖులుగా చెలామణి అయిపోతున్నారు,” అని ట్వీట్ చేసారు.
బీజేపీ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ భారత్ సురక్షితం కాదనుకొంటే అమీర్ ఖాన్ ఏ దేశం వెళ్లిపోవాలను కొంటున్నారు? ఈ ప్రపంచంలో మరే దేశానికి కూడా భారత్ అంత మత సహనం లేదు. ఒక ముస్లిం కుటుంబానికి హిందువుల వంటి మంచి ఇరుగుపొరుగులు మరెవరూ ఉండబోరు.యూరోప్ మరియు ముస్లిం దేశాలలో ముస్లింల పరిస్థితి ఏవిధంగా ఉందో అమీర్ ఖాన్ కి తెలుసు తెలియదో కానీ అక్కడ కూడా ఏదో ఒక రూపంలో జాతి, మత అసహనం ఉంది. కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని మతాలకు చెందిన ప్రజలు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలతో హాయిగా జీవిస్తున్నారు.”
“ఈ దేశంలో ఒక వ్యక్తిని అతని కులం, మతం బట్టి కాకుండా అతని శక్తి, సామర్ద్యాలు, తెలివి తేటలను బట్టే గౌరవిస్తారు. దేశం గర్వించదగ్గ నటులలో ఒకడయిన అమీర్ ఖాన్ కి ఆ విషయం తెలుసు. అయినా ఆయన ఈ విధంగా మాట్లాడటం చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి దుష్ప్రచారం వెనుక ఎవరు ఉన్నారో మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్టను మంటగలిపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి దిశలో వేగంగా అడుగులు వేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ వాటితో పోటీ పడే స్థాయికి ఎదిగే ప్రయత్నాలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ చాలా నీచ రాజకీయాలు చేస్తోంది. దేశం ఏమయినా పరువాలేదు ఏదో ఒకలాగ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తోంది. అటువంటి రాజకీయ దురాలోచనలు చేసే పార్టీ చేస్తున్న విష ప్రచారం వలన ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ పట్ల ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుందో ఎప్పుడయినా ఆలోచించిందా? చివరికి అమీర్ ఖాన్ వంటి తెలివయిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడటం చాలా శోచనీయం,” అని అన్నారు.