కమర్షియల్ సినిమా అంటేనే హీరో చుట్టూ తిరుగుతుంది. అతని ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొనే నిర్మాతలు పెట్టుబడి పెడతారు. అతన్ని చూసే బయ్యర్లు సినిమా కొంటారు. అతని కోసమే జనాలు థియేటర్లకు వెళ్తారు. సినిమా బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ తేడా కొడితే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అప్పటి వరకూ హీరోని మోసినవాళ్లంతా కింద పడేసి తొక్కేయాలని చూస్తుంటారు. అమీర్ ఖాన్ విషయంలో ఇదే జరుగుతోంది. అమీర్ నటించిన తాజా చిత్రం `లాల్ సింగ్ చద్దా` బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయాన్ని మూటగట్టుకొంది. ఈ సినిమా కనీసం 60 కోట్లు కూడా తెచ్చుకోలేదు. అమీర్ నుంచి ఏ సినిమా వచ్చినా తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లు అందుకోవడం అలవాటైన చోట.. సినిమా టోటల్ రన్లో రూ.60 కోట్లు కూడా సాధించలేకపోవడం మింగుడు పడని వ్యవహారం. ఈ సినిమా కొన్న బయ్యర్లంతా భారీగా నష్టపోయారు. చాలా ఏరియాల్లో నిర్మాతలే స్వయంగా విడుదల చేశారు కాబట్టి.. ఆ నష్టాలన్నీ వాళ్లపై పడ్డాయి.
ఇప్పుడు ఆ నష్ట భారం పంచుకోవడానికి అమీర్ ఖాన్ ముందుకొచ్చాడు. తన పారితోషికం నుంచి రూ.50 కోట్లు తిరిగి నిర్మాతలకు ఇచ్చేశాడట అమీర్ ఖాన్. వయాకామ్ 18తో కలిసి అమీర్ ఈ సినిమాని నిర్మించి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాతలకు అమీర్ రూ.50య కోట్లు చెల్లించినట్టు టాక్. అంతేకాదు.. వయాకామ్ కి మరో సినిమా కూడా చేసి పెడతానని మాటిచ్చాడట అమీర్. సాధారణంగా ఒక్కో సినిమాకీ రెండు మూడేళ్లు కష్టపడడం అమీర్ అలవాటు. అయితే ఈసారి అంత టైమ్ తీసుకోదలచుకోలేదట. ఈ యేడాది ఓ సినిమాని కచ్చితంగా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకొన్నాడట. అది వయాకామ్ కోసం తీసుకొన్న నిర్ణయం అని తేలింది.