హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా మూడు రోజుల వ్యవధిలో ఏపీలో పర్యటించబోతున్నారు. అమిత్ షా ఏపీలోని విశాఖలో ఎనిమిదో తేదీన బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. కారణం ఏదైనా మూడు రోజులుకు వాయిదాపడింది . తిరుపతిలో మాత్రం జేపీ నడ్డా పదో తేదీన సమావేశం పెట్టనున్నారు. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జనసేన పార్టీ మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉండటం లేదు. రెండు పార్టీల అగ్రనేతలు.. బీజేపీ హైకమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నారు. తమపై చల్లని చూపు కొనసాగించాలని జగన్ అదే పనిగా బీజేపీ పెద్దల్ని కోరుతున్నారు. వారు అడిగిన పనులన్నీ చేస్తున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు. ఆయనకూ బీజేపీతో కలవాలన్న ఉద్దేశం లేకపోతే.. కనీసం.. బీజేపీకి తాము దూరం కాదు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికైనా ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది బీజేపీ నేతలకు పజిల్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై రాజకీయం విమర్శలు చేస్తే.. వైసీపీకి ఈ సారి పరోక్ష మద్దతు ఉండదని చెప్పినట్లవుతుంది. తమ గొప్పలు చెప్పుకుని వెళ్తే… ఏపీలో బీజేపీ గురించి తాము పట్టించుకోవట్లేదని చెప్పినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే… నడ్డా, అమిత్ షాలు ఇచ్చే సందేశం కోసం ఏపీ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు.