కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆదివారం నారా లోకేష్ భేటీ అయ్యారు. సాధారణంగా అమిత్ షా ఆదివారం పూట అధికారిక సమావేశాల్లో పాల్గొనరు. అంటే నారా లోకేష్‌తో భేటీ పూర్తిగా రాజకీయమే అనుకోవచ్చు. దాదాపుగా నలభై నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. లోకేష్ క్యాంప్ మాత్రం… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు నారా లోకేష్ వివరించారని.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారని చెబుతోంది. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారని అంటోంది. కానీ నారా లోకేష్ ప్రత్యేక ఎజెండాతోనే అమిత్ షాను కలిశారని భావిస్తున్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ అమలును లోకేష్ బాధ్యతగా తీసుకున్నారు. అయితే అన్నీ చట్టబద్దంగానే తీసుకోవాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దూకుడుగా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. బీజేపీతో సంప్రదింపులు జరపాల్సిందే. రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపితే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కీలకమయ్యే విషయాల్లో వారితో మాత్రమే మాట్లాడాల్సి ఉంది. అందుకే లోకేష్ ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే నారా లోకేష్ ఢిల్లీకి తీసుకెళ్తున్నఎజండా ఏమిటో ఆయన సన్నిహితులకు కూడా తెలియదు.
జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ చేసిన నేరాలు, ఘోరాలపై ప్రతి ఆధారాన్ని సేకరించి సంపూర్ణమైన నివేదికలను ఆయన కేంద్రానికి సమర్పిస్తున్నారని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో కూడా ముందుగా సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు. తద్వారా దూకుడుగా… తొందరపాటుగా నిర్ణయాలు తీసుకున్నారన్న భావన రాకుండా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ ఏది చేసినా ప్రణాళికాబద్దంగా చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకండా చేస్తోంది.