హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా ఇవాళ రెండోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు ఇతర మంత్రులు అమిత్ షా పేరును ప్రతిపాదించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో అమిత్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ళపాటు కొనసాగుతారు. ఇంతకుముందు, అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ 2014 మే నెలలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించటంతో అమిత్ షా ఆయన స్థానంలో అధ్యక్ష పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమిత్ షా ఎన్నికపై స్పందిస్తూ, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిఉన్న అమిత్ షా ఆ పదవికి సరైన వ్యక్తి అన్నారు. ఆయనకు వ్యవస్థను నడిపించగల సామర్థ్యం, మంచి వ్యూహాలు, నిబద్ధత ఉన్నాయని చెప్పారు. అమిత్ షా పదవిని చేపట్టిన తర్వాత బీజేపీ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, కాశ్మీర్ రాష్ట్రాలలో అధికారంలోకి రాగా, ఢిల్లీ, బీహార్ వంటి కీలక రాష్ట్రాలలో ఓడిపోయింది.