కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి గంట పాటు భేటీ అయ్యారు. ఆయన వెంట విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నారు. భేటీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఏమేమి మాట్లాడారో అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. మూడు రాజధానులకు సహకరించాలని జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి కోరారని.. కర్నూలుకు హైకోర్టును రీలోకేట్ చేసేలా ఆదేశాలిప్పించాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు.. పోలవరం ప్రాజెక్ట్ సహా ఇతర అంశాలన్నింటిపై చర్చించినట్లుగా సీఎంవో తెలిపింది.
మామూలుగా అయితే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి అయితే… అధికారుల్ని తీసుకెళ్లి ప్రధానంగా వారితోనే నిధుల అవసరాన్ని చెప్పిస్తారు. కానీ అమిత్ షాతో భేటీలో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాధరరణంగా రాజకీయ పరమైన భేటీలకు మాత్రమే.. రాత్రి సమయంలో సమయం కేటాయిస్తారని.. అధికారికం అయితే.. ఉదయమే పని వేళల్లో సమావేశమవుతారని చెబుతూ ఉంటారు. జగన్, విజయసాయిరెడ్డి భేటీల్లో రాజకీయపరమైన చర్చలు కూడా ప్రధానంగా సాగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అసలు అపాయింట్మెంట్ను జగన్ కోరారా లేకపోతే… అమిత్ షానే పిలిపించారా అన్నదానిపై కూడా స్పష్టత లేదు.
పోలవరం నిధుల విషయంలో అదే పనిగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆయనకు ఎక్కడా సానుకూల స్పందన రావడం లేదు. ఈ క్రమంలో అమిత్ షాకు చెప్పుకోవడానికి ఆయన అపాయింట్మెంట్ను సీఎం తీసుకున్నారని చెబుతున్నారు. గత పర్యటనలో మోడీ, అమిత్ షాలతో జగన్ భేటీ అయినప్పటికీ.. ఫలానా అంశాలపై చర్చించారన్నదానిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. కానీ ఈ సారి మాత్రం భేటీ ముగియగానే… విడుదల చేశారు.